సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్
ఎవరైనా కట్టుబడాల్సిందే
జేసీకి షోకాజ్
నిర్మొహమాటంగా సభ్యులు అభిప్రాయం చెప్పండి
ఓటింగ్ ఉండదు.. కుండబద్దలు కొట్టిన దిగ్విజయ్
హైదరాబాద్, డిసెంబర్ 13 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ తీర్మానమే అంతిమ నిర్ణయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానమే అంతిమ నిర్ణయమని కాంగ్రెస్ వాదులందరికీ తెలుసని.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. విభజనకు ముందే ఇరు ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీలు వేయాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే రెండు ప్రత్యేక కమిటీలు పీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తాయని తెలిపారు. ప్రత్యేక కమిటీలపై సోనియాగాంధీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.ఇదిలావుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తామని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా సోనియాపై జేసీ చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి అడగగా దిగ్విజయ్ పై విధంగా స్పందించారు. పార్టీ నిర్ణయానికి సీఎం సహా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి దిగిపోవాలని, కాంగ్రెస్ పనై పోయిందని జేసీ గతంలో కామెంట్ చేసిన విషయం విదితమే. దీనిపై కాంగ్రెస్ సీరియస్‌గా ఆలోచిస్తోందన్నారు. సోనియాగాంధీపై వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజు నోటీసు ఇస్తామని తెలిపారు. వైకాపా అధినేత జగన్ మా డీఎన్‌ఏ అని చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. 15 రోజుల్లోపు విశాఖపట్నంలో పర్యటిస్తానని చెప్పారు. ఇదిలావుంటే గాంధీభవన్ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవో నేతలను ఏపీఎన్జీవో భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఏపీఎన్జీవో నేతలను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సీఎం తీరుపై తెలంగాణ నేతల ఫిర్యాదు
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ రెండోరోజు కూడా బీజీ బీజీగా గడుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఆఫీస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో డిగ్గీ రాజా సమావేశం అయ్యారు. అయితే ఉదయం ఆయన గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు, వారిరువురు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. గతంలో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా గవర్నర్‌ను కలవలేదు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దిగ్విజయ్ రాజభవన్ వెళ్లి నరసింహన్‌తో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన అక్కడ నుంచి గాంధీభవన్‌కు బయలుదేరి వెళ్లారు. అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణపై వెనక్కి పోయేది లేదన్నారు. ఇక విబజన సజావుగా సాగుతుందని అన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రుల భద్రత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. హైదరాబాద్ అంశంలో రక్షణపరమైన వ్యవహారాలు తప్ప మిగతావన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయన్నారు. ఉమ్మడి రాజధాని పదేళ్లు మాత్రమేనన్నారు. సమైక్యాంధ్ర పేరుతో టిడిపి, వైకాపా యూటర్న్ తీసుకున్నాయని దిగ్విజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చి వెనక్కి వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిఅలావుంటే
తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్‌లో దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. సీఎం వైఖరిపై వారు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం ఉద్దేశపూర్వకంగా బిల్లు శాసనసభకు రాకుండా చేశారని వారు పేర్కొన్నారు. అంతకు ముందు వారంతా మంత్రి డీకే అరుణ నివాసంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, డీఎస్, మంత్రులు శ్రీధర్‌బాబు, జానారెడ్డి, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. సీఎంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం అడుగడుగునా అడ్డు పడుతున్నారని, కిరణ్ తెలంగాణ ద్రోహి అని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కడిగిపారేశారు. తప్పని పరిస్థితుల్లో సీఎంను దింపేస్తామని దామోదర అన్నారు. మరోవైపు ఓయూ జేఏసీ విద్యార్థులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. గాంధీ భవన్‌లో దిగ్విజయ్‌ని కలిసిన జేఏసీ విద్యార్థులు తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి దిగ్విజయ్ సానుకూలంగా స్పందించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి రామచంద్రయ్య భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించేందుకు దిగ్విజయ్‌సింగ్ నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రామచంద్రయ్య దిగ్విజయ్‌ను కలసి మాట్లాడారు. వీరివురు ఏం మాట్లాడారన్నది తెలియరాలేదు.