Wednesday, 4 November 2026

సీఎం సీమాంధ్ర పక్షపాతి

తక్షణం దిగిపో : డీకే అరుణ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర పక్షపాతి అని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. తెలంగాణ ముసాయిదా రాష్ట్రానికి చేరిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ మంత్రులు, టీ కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం డీకే అరుణ నివాసంలో భేటీ అయ్యారు. అనంతనం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి తక్షణమే దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే తెలంగాణపై అసెంబ్లీలో చర్చించి ముసాయిదాను రాష్ట్రపతికి తిరిగి పంపించాలని ఆమె కోరారు. మరోవైపు సీఎం కిరణ్డ్‌పై డెప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ నిప్పులు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిపై తెలంగాణ ప్రాంత మంత్రులం విశ్వాసం కోల్పోయామని, వెంటనే సీిఎల్పీని సమావేశపర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో కిరణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని, తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అడుగడుగునా ఆయన తెలంగాణను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము ఎంతగా సంయమనం పాటించినా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని అన్నారు. అనంతరం తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్‌లో దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. సీఎం వైఖరిపై వారు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం ఉద్దేశపూర్వకంగా బిల్లు శాసనసభకు రాకుండా చేశారని వారు పేర్కొన్నారు. పీసీసీ మాజీ చీఫ్‌ డీఎస్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, జానారెడ్డి, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. తప్పని పరిస్థితుల్లో సీఎంను దింపేస్తామని దామోదర ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *