స్పీకర్ నిర్ణయంపైనే అందరి దృష్టి
హైదరాబాద్, డిసెంబర్ 15 (జనంసాక్షి) :
అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో సో మవారం జరగనున్న సభా వ్యవహారాల సలహా సం ఘం (బీఏసీ) సమావేశంపై అంతటా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013ను సభలో ప్రవేశపెట్టి చర్చించాల్సిన తేదీని బీజేపీ ఖరారు చేసే అవకాశం ఉండడంతో సమావేశం ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆత్రుత్రగా ఎదురు చూస్తున్నారు. సమావేశం సందర్భంగా సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా తన వాణి విన్పించిన పక్షంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్‌బాబు సీఎంకు ధీటుగా బిల్లుపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఆ విధంగా బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపించి ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలనేది వారి భావన. అదే జరిగితే స్పీకర్ నాదెండ్ల మనోహర్ మినహా బీఏసీలో పాలకపక్షానికి చెందిన సీమాంధ్ర సభ్యులు, కాంగ్రెస్ అధిష్టానానికి విధేయులుగా పేరొందిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డిలాంటి వారు తెలంగాణ సభ్యుల వాదనపై మారుమాట్లాడకపోవచ్చు. అలాగే టీడీపీ సభ్యుల్లో ప్రాంతాల వారీగా చోటు చేసుకున్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ తరపున ఇరు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న గాలి ముద్దుకృష్ణమానాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య వాడీవేడి వాదన చోటు చేసుకుంది. కాగా, అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒక తీర్మానం చేయాలని వైసీపీ సభ్యులు బీఏసీ సమావేశంలో కోరే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ సభా పక్ష నాయకులు డిమాండ్ చేయవచ్చు. ఇక సోమవారం అసెంబ్లీ సమావేశాల విషయానికొస్తే ఇదే తరహా ప్రాంతీయ విభేదాలు అక్కడ కూడా కనిపించవచ్చు. తెలంగాణ బిల్లును తక్షణమే సభలో పెట్టాలని తెలంగాణ సభ్యులు డిమాండ్ చేస్తే, బిల్లుపై చర్చను సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఏకమవుతున్నట్లుగా సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో అత్యధికులు బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు సేకరించాలని డిమాండ్ చేస్తూ ప్రక్రియను సాగదీయాలని ఆశించవచ్చు. ఆ క్రమంలో రాష్ట్రపతి జనవరి 23 దాకా సమయం ఇచ్చినందున జనవరిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు తార్కాణంగా వచ్చే నెలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుపై చర్చ పెట్టాలని ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి శైలజానాథ్ పట్టుబడుతున్నారు. దీనికి తోడు బిల్లులో ప్రతి క్లాజుపై చర్చతో పాటు ఓటింగ్ నిర్వహించాలని సీఎంతో పాటు సీమాంధ్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న కారణంగా సభలో గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంది.
నేడు బీఏసీ సమావేశం




