ఉభయ సభల్లో…
బీరిపోయిన సీమాంధ్రులు
స్పీకర్ పోడియం ముందు రగడ
ప్రతులు చించి స్పీకర్‌పై దాడి
65 పేజీల ముసాయిదా.. 13 షెడ్యూళ్లు
అన్ని పాత ముచ్చట్లే…
హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిలో సోమవారం చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులు అసెంబ్లీకి చేరుకున్నాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ్యుల నిరసనల మధ్య సోమవారం ఉదయం 10 గంటల సమయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను సభ్యులకు అందజేస్తున్నట్టు వెల్లడించారు. శాసనసభ వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతిని ఉంచాం.. తెలుగు, ఉర్దూ ప్రతులను సైతం అందుబాటులో ఉన్నాయని, సభ్యులకు అందజేయనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా 65 పేజీల బిల్లు ప్రతిలోని ప్రత్యేకాంశాలను అసెంబ్లీ కార్యదర్శి సదారాం అసెంబ్లీలో చదివారు.
65 పేజీలు 13 షెడ్యూళ్లతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయం కోసం పంపారు.
– 1వ షెడ్యూలులో.. రాజ్యసభ వివరాలు
– 2వ షెడ్యూలులో..అసెంబ్లీ, పార్లమెంటు వివరాలు
– 3వ షెడ్యూలులో.. శాసనమండలి వివరాలు
– 4వ షెడ్యూలులో..ఎమ్మెల్సీల విభజన
– 5వ షెడ్యూలులో.. దళితుల వివరాలు
– 6వ షెడ్యూలులో.. గిరిజనులు
– 7వ షెడ్యూలులో.. నిధుల కేటాయింపు
– 8వ షెడ్యూలులో పెన్షన్లు పంపిణీ
– 9వ షెడ్యూలులో ప్రభుత్వ కార్పొరేషన్ల వివరాలు
– 10లో ప్రభుత్వ సంస్థల వివరాలు
– 11వ షెడ్యూలో నదీ జలాల పంపిణీ
– 12లో సహజ వనరుల విభజన వివరాలు
– 13లో విద్య, మౌలిక వసతుల వివరాలు
– నదీ జలాల పంపిణీకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నతస్థాయి కమిటీ
– కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ఇరు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు
– రెండు రాష్ట్రాల్లోనూ శాసనమండలి కొనసాగింపు
– ఇరు రాష్ట్రాలకు ఇప్పుడున్న గవర్నరే కొనసాగింపు
– హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల భద్రత బాధ్యత గవర్నర్‌కు అప్పగింత.
1956లో కలిపిన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను విడదీసి తిరగి రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి అసెంబ్లీ వేదికగా నాంది పలికారు. సుదీర్ఘ పోరాటం, ఎందరో ఆత్మబలిదానాల అనంతరం కేంద్రం విభజనకు తీసుకున్న నిర్ణయంతో విభజన బిల్లు రెడీ అయి అసెంబ్లీకి చేరింది. గత గురువారం సాయంత్రం చేరుకున్న ముసాయిదా బిల్లు శుక్రవారం మధ్యాహ్నం వాయిదా పడ్డ తరవాత అసెంబ్లీకి చేరుకుంది.అయితే ఆ రోజు సమయం లేకపోవడంతో సోమవారం దానిని ప్రవేశ పెట్టారు. ఇక అసెంబ్లీ చర్చ ఎప్పుడన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. అనంతరం బిల్లుపై అభిప్రాయాలను జోడించి తిరిగి కేంద్రానికి పంపుతారు. ఈ పార్లమెంట్ సమావేశాలు లేదా ప్రత్యేక సమావేశాలను పెట్టి ఆమోదించాక రెండు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తారు. బిల్లు రాష్ట్రానికి చేరడంతో రాజ్యాంగ నిబంధనల మేరకు బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన విభజన ముసాయిదా బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభలో ప్రవేశ పెడుతూ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజాలు, అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత నాయకులు ఉద్విగ్నంగా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా బిల్లుపై నాదెండ్ల మనోహర్ ప్రకటన చేసి చారిత్రక అంశానికి సాక్షీభూతులయ్యారు. అయితే ఈ సమయంలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అస్వస్త కారణంగా అసెంబ్లీకి రాలేకపోయారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి రాలేదు. సభానాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ లేకుండానే ఈ చారిత్రక విభజన బిల్లు అసెంబ్లీకి రావడం విశేషం. వీరిద్దరూ బ్లిలును గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సోమవారం సమావేశమయ్యాక గందరగోళం మధ్య వాయిదా పడ్డ అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ(తెలంగాణ) బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. అసెంబ్లీ కార్యదర్శి సదారం బిల్లులోని అంశాలను సభలో చదివి వినిపించారు. సభ్యుల సౌకర్యార్థం తెలుగు, ఉర్దూ భాషల్లో బిల్లు ప్రతిని అందుబాటులో ఉంచినట్లు స్పీకర్ తెలిపారు. శాసనసభ వెబ్‌సైట్‌లో కూడా బిల్లు ప్రతిని ఉంచినట్లు చెప్పారు. అనంతరం ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టగానే సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టి నిరసనలు వ్యక్తం చేశారు. తెలుగు, ఉర్దూలో కూడా టీ బిల్లును తర్జుమా చేస్తామని స్పీకర్ తెలిపారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టాక అరగంటపాటు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బిల్లు సభలో ప్రవేశ పెట్టాక డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, శాసనభా వ్యవహారాల శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబులు లేచి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు అంతా ఒక్కుదుటన లేచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి చేరినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రపతి లేఖను అసెంబ్లీ కార్యదర్శి సదారాం సభలో చదివి వినిపించారు. రాష్ట్రపతి లేఖను చదువుతుండగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసమండలిలో మండలి చైర్మన్ చక్రపాణి ప్రవేశపెట్టారు. మండలిలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు ప్రాంతాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. శాసనసభ వాయిదా పడగానే బయటకు వచ్చిన టిడిపి సీమాంధ్ర సభ్యులు ఆగ్రహంగా ఊగిపోతూ బిల్లు ప్రతులను చింపి పారేశారు. ఇది రాజ్యాంగ విరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిల్లును చింపేస్తుండగా టిఆర్‌ఎస్‌కు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. బిల్లు పత్రల చించివేతకు నిరసనగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. 56 ఏళ్ల కల సాకారం అయ్యే వేళ సీమాంధ్ర టీడీపీ నేతలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు. కళ్ల ముందే బిల్లును చింపివేయడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆవేదన ఉంటే చర్చ జరిగినప్పుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలను చెప్పి ఉంటే బాగుండేదన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు దురంహకారంతో ప్రవర్తిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేకపోతే శాసనసభలో అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కొట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. తాము అండగా నిలిచామని ఎమ్మెల్యే అన్నారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, టీ బిల్లు అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ కంటే ముందు దామోదర స్పీకర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ చక్రపాణి సోమవారం రెండోసారి వాయిదా అనంతరం గందరగోళం మద్య ప్రవేశపెట్టారు. ఓవైపు సీమాంధ్రకు చెందిన టిడిపి ఎమ్మెల్సీలు గందరగోళం సృష్టిస్తున్నా, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తుండడంతో ఏం జరుగుతుం దో తెలియని పరిస్థితి నెలకొంది. తీవ్రగందర గోళం మధ్యచైర్మన్ చక్రపాణి సభలో రాష్ట్రపతి నుంచి తమకు తెలంగాణ రాష్ట్ర బిల్లుకు సంబందించిన లేఖ అందింది. దీనిని శాసనమండలి కార్యదర్శి సదారాం చదివి వినిపిస్తారని చెప్పారు. దీంతో సదారాం లేచి రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖ వివరాలను చదివి వినిపించారు. బిల్లు ప్రతులు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లి ష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని చైర్మన్ చక్రపాణి పేర్కన్నారు. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో చైర్మన్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.
స్పీకర్ మనోహర్ తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో ఎట్టకేలకు డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సభాపతి స్థానంలో కూర్చొని చర్చను ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన సీమాంధ్ర ఎమ్మెల్యే బిల్లు ప్రతులు చించి భట్టిపై దాడికి యత్నించారు. వారి చర్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కపై సోమవారం సభలో జరిగిన దాడిని వారు చాలా అమానుషమైనదిగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల కల సాకారమవుతున్న వేళ సీమాంధ్ర నేతలు ఇలా ప్రవర్తించడం చాలా దారుణమన్నారు. స్పీకర్‌పై దాడి చేయడాన్ని తెలంగాణ నేతలు మంత్రి శ్రీధర్‌బాబు, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్ తదితరులు తీవ్రంగా ఖండించారు. ఇదిలావుంటే రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఆ సంఘ నేతలు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించాలని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ కోరారు. తెలంగాణ ప్రజలను సీమాంధ్ర నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ఇవాళ సభలో చర్చకు రావడం శుభదాయకమని పేర్కొన్నారు. సభలో సీమాంధ్ర నేతలు తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించడమంటే రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను శాశ్వత శత్రువులుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ బిల్లు సభలో చర్చకు రావడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టమని తెలంగాణ ఉద్యోగ సంఘాల మరోనేత విఠల్ తెలిపారు. తెలంగాణ బిల్లు విషయంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టడంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిల్లు సభలో చర్చకు రావడం సంతోషకరమన్నారు. తెలంగాణలో వెంటనే హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ మంగళవారానికి వాయిదా
సభ్యులు గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు గా నినాదాలు చేసి ఆందోళనలు కల్గించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టి ముట్టి ఆందోళనకర పరిస్థితులు సృష్టించారు. తొందర పాటు చర్యలు పాల్పడకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత బుధవారం జరిగిన బీఏసీలో బిల్లుపై వారం రోజులు చర్చించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సభకు సెలవు కావడంతో తిరిగి అసెంబ్లీ సోమవారం ఆరంభమైంది. గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేయక తప్పలేదు. బిల్లు పెట్టిన తరవాత చర్చించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేయక తప్పలేదు.