Wednesday, 4 November 2026

నిబంధనల ప్రకారమే తెలంగాణ బిల్లు

మొన్నటి బీఏసీలోనే నిర్ణయించాం : శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రధానమైన బిల్లు అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా స్పీకర్‌ కార్యాలయం ఎదుట కూర్చోవడం సరైంది కాదని హితవు పలికారు. స్పీకర్‌ను అడ్డుకోవాలని చూడడం తగదన్నారు. ఇలాంటి చర్యలతో బిల్లును అడ్డుకోవడం మూర్ఖత్వం కాక మరోటి కాదన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పెట్టేందుకు అన్ని పార్టీలు.. ఇంతకు ముందు జరిగిన బీఏసీ సమావేశంలో ఒప్పుకున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు. సభలో బిల్లు ప్రవేశపెట్టే అంశంపై బీఏసీ సమావేశంలో ఇదివరకే నిర్ణయం జరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.  నిబంధనల ప్రకారమే స్పీకర్‌ బిల్లును ప్రవేశపెట్టారని చెప్పారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరించారని రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇదిలావుంటే బిల్లుపై తక్షణం చర్చకు అనుమతించాలని కోరుతూ అసెంబ్లీలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. టీ బిల్లుపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేసారు. మరోవైపు స్పీకర్‌ ఛాంబర్‌లో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగనీయకుండా సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు.   బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ స్పీకర్‌ ఛాంబర్‌ వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి  ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆర్థికమంత్రి ఆనం రాం నారాయణరెడ్డి ఛాంబర్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు భేటీ అయ్యారు. శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సిఎం లేకపోవడంతో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసినట్లు సమాచారం. అనంతరం  నాదెండ్ల మనోహర్‌తో మంత్రులు ఆనం, రఘువీరా, పితాని భేటీ అయ్యారు. బీఏసీ సమావేశం నిర్వహించకుండానే బిల్లును సభలో ఎలా ప్రవేశపెడతారని సీమాంధ్ర నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఏసీ సమావేశంలో స్పష్టత ఇచ్చారని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *