న్యూఢిల్లీ, డిసెంబర్ 16 (జనంసాక్షి) :
చైనా నుంచి చొరబాట్ల అంశాన్ని తోసిపుచ్చలేమని రక్షణ మంత్రి ఆంటోనీ పేర్కొన్నారు. అయితే, సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపధ్యంలో ఇలాంటి అంశాలను ఎప్పటి కప్పుడుపరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. తాజా ఘటనలో నేపథ్యంలో ఆయన ఈమేరకు స్పందించారు. మరోవైపు సరిహద్దు సమస్యలపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల చర్చలపై ప్రశ్నించగా వారి నుంచి అద్భుతాలు ఆశించలేమన్నారు. సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై విజయానికి గుర్తుగా సోమవారమిక్కడ నిర్వహించిన విజయ్ దివస్ సందర్బంగా ఆంటోనీ విలేకర్లతో మాట్లాడారు. శాంతియుత వాతావరణం కొనసాగేలా చూడాలనేదే మన నిర్ణయం. సుదీర్ఘ సరిహద్దు ఉన్న నేపథ్యంలో చోరబాటులాంటి ఘటనలను తొసిపుచ్చలేం. ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆంటోని అన్నారు. ఇటీవల ఐదుగురు భారతీయులను చైనా బలగాలను నిర్బంధించిన అంశంపై ప్రశ్నించగా వారు సైనికులు కాదని, పౌరులని చెప్పారు. ఈ సమస్య సామరస్య వాతావరణంలో పరిష్కారమైందని వెల్లడించారు.





