న్యూఢిల్లీ, డిసెంబర్ 17 (జనంసాక్షి) :
లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు కేంద్రమంత్రి కమల్‌నాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటలవరకూ సభలో చర్చ జరగగా అనంతరం ఓటింగ్ నిర్వహించారు. దీనిపై బుధవారం లోక్‌సభలో చర్చించి ఆమోదిస్తారు. ఇప్పటికే అన్ని పార్టీలు ఆమోదం తెలపడంతో బిల్లుకు అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందడంతో రాలెగావ్‌సిద్ధిలో అన్నాహజారే మద్దతుదారులు సంబరాలు జరుపుకొన్నారు. బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందుతుందని అన్నా హజారే ఆశాభావం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఈ బిల్లుపై ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, బిల్లును ఆమోదించడం ద్వారా సభ చరిత్ర సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. సెలెక్ట్ కమిటీ సిఫార్సులను ఆయన సభలో చదివి వినిపించారు. ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు చొరవ చూపడం అభినందనీయమని అన్నారు విపక్షనేత అరుణ్‌జైట్లీ. 2011 డిసెంబరు నాటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన ఆశించారు. బిల్లు పరిధికి సంబంధించి జైట్లీ చేసిన సూచనను సవరణల్లో పేర్కొన్నట్లు మంత్రి సిబల్ సమాధానమిచ్చారు. అన్ని రాష్ట్రాలూ లోక్‌పాల్ బిల్లును అమలుచేయాలని బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా చెప్పారు. లోక్‌పాల్‌పై పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి రావడం శుభపరిణామమని సీపీఎం సభ్యులు సీతారాం ఏచూరి అన్నారు. ప్రైవేటు వ్యవస్థలనూ, ఎన్జీవోలనూ కూడా బిల్లు పరిధిలోకి తేవాలని ఆయన సూచించారు. లోక్‌పాల్ బిల్లును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తెలిపారు. ఇదో చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ తన వాగ్దానాన్ని నెరవేర్చుకోబోతోందని, గణతంత్ర దినోత్సవాం నాటికి ఇది బిల్లుగా ప్రజల ముందుకు రాబోతోందని అన్నారు. రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడం పట్ల సామాజికవేత్త అన్నా హజారే హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రజావిజయమని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదించినందుకు రాజ్యసభకు ధన్యవాదాలు తెలిపారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదించాలని దేశ ప్రజలందరి తరఫున లోక్‌సభకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నా హజారే తెలిపారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందుతుందని అన్నా ఆశాభావం వ్యక్తంచేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీక్ష విరమిస్తానని అన్నా తెలిపారు. అయితే తాను దేశ హితం కోరి బిల్లు కోసం పట్టుబట్టానని అన్నారు. దీంతో కనీసం 40,50 శాతం అవినీతి తగ్గుతుందని అన్నారు.ఇది ఓ ముందడుగు కాగలదన్నారు. బిల్లుకు ఆమోదం పొందడంతో రాలెగావ్ సిద్దిలో సంబరాలు జరుపుకున్నారు. పలువురు అన్నాకు అభినందనలు తెలిపారు.
రేపు లోక్‌సభలోకి లోక్‌పాల్ బిల్లు
అన్నా హజారే దీక్షతో కేంద్రంలో కదలిక వచ్చింది. లోక్‌పాల్ బిల్లుకు చకచకా పావులు కదిపింది. దీంతో రాజ్యసభలో బిల్లు చర్చకు వచ్చింది. లోక్‌సభలో బుధవారం లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడుతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. దీనికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుసుతోందన్నారు. ఇప్పటికే రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందేనన్నారు. లోక్‌పాల్ బిల్లు చారిత్రాత్మకమైన బిల్లు అని కేంద్రమంత్రి కపిల్‌సిబల్ పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లుపై రాజకీయం చేయడానికి ఇది సమయం కాదన్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. లోక్‌పాల్ ద్వారా పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని చెప్పారు. లోక్‌పాల్ బిల్లు తెచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్‌పాల్ ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలన్నారు. రాజ్యసభలో ఆయన చర్చను ప్రారంభించారు. రాజ్యసభలో లోక్‌పాలో బిల్లుపై చర్చలో బిజెపి పాల్గొంది. ఈ సందర్భంగా బిజెపి నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ కీలకమైన లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలని కోరారు. బలమైన లోక్‌పాల్ కోసం భవిష్యత్తులో మరిన్ని సవరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. బిల్లు అమలైతే ఏడాదిలోగా అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బిజెపి దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నదని అన్నారు. మరోవైపు చర్చ కొనసాగుండగానే లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్ వాదీ పార్టీకి చెందిన సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ముందునుంచీ వీరు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇక రాజ్యసభలో లోక్‌పాల్‌పై చర్చ చేపట్టాక నిరసనగా వారు వాకౌట్ చేశారు. మరోవైపు లోక్‌పాల్‌కు కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత లోక్‌పాల్‌కు అన్నా హజారే కూడా సుముఖంగా ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. తొలుత పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన మూడు నిమిషాలకే గంట పాటు వాయిదా పడ్డాయి. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి లోక్‌పాల్‌పై చర్చ ప్రారంభించాలని విపక్ష నేత అరుణ్ జైట్లీ సభాపతిని కోరారు. దీన్ని మన్నించిన సభాపతి చర్చ ప్రారంభించాలని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్‌ను కోరారు. లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు వెంటనే సభ మధ్యలోకి దూసుకొచ్చారు. చర్చ ప్రారంభం కాకుండా అడ్డుతగిలారు. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇదిలావుంటే బలమైన లోక్‌పాల్ బిల్లును అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఎట్టి పరిస్తితుల్లోనూ లోక్‌పాల్ తేవడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. లోక్‌పాల్ బిల్లుపై రాహుల్‌గాంధీ చిత్తశుద్ధిని అన్నాహజారే స్వాగతించారు. అయితే సెలెక్ట్ కమిటీ సిఫార్సులను బిల్లులో పొందుపరచాలని కోరారు. ఇదిలా ఉండగా బిల్లుకు మద్దతిచ్చిన హజారేకు రాహుల్‌గాంధీ ధన్యవాదాలు తెలిపినట్లు ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ తెలిపారు. ఈ అంశంపై ఇరువురూ లేఖలు రాసుకున్నారని ఆయన వెల్లడించారు. లోక్‌పాల్ బిల్లుకు సమాజ్‌వాదీపార్టీ మద్దతిస్తుందని నమ్ముతున్నామని కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లోక్‌పాల్ బిల్లును తెలుగుదేశం పార్టీ సమర్థిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామానాగేశ్వరరావు తెలిపారు. 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. బలమైన లోక్‌పాల్ ద్వారానే అవినీతిని అరకట్టగలమన్నారు. దీనికి సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా కూడా మద్దతు తెలిపారు. బలమైన లోక్‌పాల్ బిజెపి ఆశయమని వెంకయ్యనాయుడు అన్నారు.
లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం




