Tuesday, 3 November 2026

తెలంగాణపై కుట్ర జరుగుతోంది

అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌
వరంగల్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఈ దశలోనూ అడ్డుకోవడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని టీ జేఏసీ చైర్మన్‌
ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భస్తున్న తరుణంలో కూడా అడ్డుకోవడానికి కొంతమంది నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. ఈ తరుణంలో కూడా ఇంకా కుట్రలకు పాల్పడడం తగదన్నారు. ఎవరు అడ్డుపడ్డా ఇక బిల్లు ఆగదని గుర్తుంచుకోవాలన్నారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన ‘తెలంగాణ పునర్నిర్మాణంలో మేధావుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చినట్టేనని తెలిపారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే సేకరిస్తారు కాబట్టి శాంతియుతంగా సభ జరిగేలా సభ జరిపించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలను కోరారు. పార్టీల కతీతంగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరకుండా అడ్డుపడితే చరిత్ర క్షమించదన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమిస్తున్నది తెలంగాణ ఏర్పాటు కోసమేనని, ఇందుకు అడ్డుతగిలే నేతలు అలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. నాలుగున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమాన్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, రిటైర్డ్‌ కాలేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *