బాబును తలంటిన నాదెండ్ల
హైదరాబాద్, డిసెంబర్ 18 (జనంసాక్షి) :
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంటే వెన్నుపోటుదారుడెవరని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఎదురుదాడికి దిగారు. 1984లో తాను, ఇప్పుడు తన కుమారుడు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కై తెలుగు ప్రజలకు ద్రోహం చేశారనే బాబు వ్యాఖ్యలపై భాస్కర్రావు దీటుగా బదులిచ్చారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును మించిన కుమ్మక్కు రాజకీయాలు చేసేవారు ఎవరూ లేరని అన్నారు. తనపైనా, తన కుమారుడు మనోహర్పైనా విమర్శలు చేసే అర్హత బాబుకు లేదన్నారు. అధికారం కోసం గడ్డి తినే రకం బాబన్నారు. అధికారం కోసం పాపిష్టి పనులు చేసింది చంద్రబాబేనని తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది బాబేనన్నారు. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని, నిన్నటి దాకా ముస్లింల గురించి మాట్లాడి ఇప్పుడు బిజెపి వైపు వెళ్లాదన్నారు. అలాంటి వ్యక్తి తన గురించి, తన కొడుకు గురించి మాట్లాడుతాడా? సమన్యాయం అంటే ఏమిటి.. కృష్ణా నదిని రెండుగా చీల్చడమా? చంద్రబాబుకు ఏం కావాలో అర్థం కావడం లేదు. డీల్స్ చేసుకోవడం నాకు కాదు.. చంద్రబాబుకు అలవాటని ఆయన మండిపడ్డారు. బిల్లును చాలా నిర్లక్ష్యంగా రూపొందించారని, తెలంగాణ బదులు తమిళనాడు అని రాశారని విమర్శించారు. బిల్లును చూస్తుంటే అధికార వ్యవస్థ ఇంతలా దిగజారిందా అని ఆవేదన కలుగుతోందన్నారు. ఎవరిని బాగు చేయడానికి విభజిస్తున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు తాను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయనకు తనపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. తన కుమారుడు నాదెండ్ల మనోహర్ పైన కూడా ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు. స్పీకర్ అనే వాడు రాజ్యాంగానికి బద్దుడన్నారు. ముసాయిదా బిల్లులో ఎన్నో తప్పులున్నాయన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే విడదీయండి కానీ.. పద్ధతి ఇది కాదు. ఇలాగే విభజన చేస్తే నవ్వుల పాలవుతామన్నారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచే సమస్యలున్నాయని, తాను విశాలాంధ్ర వాదినన్నారు. విశాలాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నా. చెన్నారెడ్డి విభజన కోసం పోరాడిన రోజుల్లోనూ మేం విశాలాంధ్ర వాదాన్ని వినిపించా. ఎవరిని బాగు చేయడానికి రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ప్రశ్నించారు.




