Tuesday, 3 November 2026

చైర్‌ను అవమానిస్తే హక్కుల ఉల్లంఘన నోటీస్‌

చర్చ ప్రారంభమైంది
సీఎంకిచ్చిన లేఖలోనే ఉంది
అనుమానాలుంటే రికార్డులు చూసుకోండి : శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :
శాసనసభ, శాసనమండలిలో టేబుల్‌ చేయడమంటేనే చర్చ ప్రారంభమైనట్లు గుర్తించాల్సి ఉంటుందని, చర్చ ప్రారంభమైనట్లు సీఎం సభికులకు ఇచ్చిన లేఖలోనే ఉందని రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 3 ప్రకారమే బిల్లును పంపించిందన్నారు. దీంతో మ్యాచ్‌ ముగిసినట్లేనన్నారు. ఇంకా ఆటనేదే లేదన్నారు. వారు ఊహిస్తున్నట్లుగా థర్డ్‌ ఎంపైర్‌కు కూడా అవకాశమేది లేదన్నారు. స్పీకర్‌ వ్యవస్థను ఎవ్వరు కించపరిచినా కూడా ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తామన్నారు. రాష్ట్రం విడిపోయేందుకు గడియలు, క్షణాలు లెక్క పెట్టుకుంటుంటే బిల్లును పట్టుకుని రాద్దాంతం చేయడం సీఎం సహా సీమాంధ్ర నేతలకు మంచిది కాదన్నారు. విభజన సమయంలో ఇలాంటి తలతిక్క వ్యవహారాలు చేసి ప్రజల మద్య వైషమ్యాలు పెంచొద్దన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి కలిసి ఉందామన్నారు. పూర్తిగా సహకరించాల్సిందేనని సీమాంధ్ర నేతలకు సూచించారు. చిట్టచివరి దశలో ఆగిపోతుందని రాబోయే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని పేర్కొంటూ ప్రజలను మోసం చేయడం ఆపాలని మంత్రి సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఎవ్వరు వచ్చినా, ఏం చేసినా చివరకు అసెంబ్లీ సమావేశాలు జరుగక పోయినా కూడా రాష్ట్రం మాత్రం విడిపోవడం ఖాయమన్నారు. బిల్లుపై ఓటింగ్‌ అనేది ఎక్కడా ఉండదన్నారు. కనీస పరిజ్ఞానం లేని వారు మాట్లాడుతున్న ట్లుగానే సీమాంధ్ర నేతల వాదనలున్నాయన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ రాష్ట్రం సమైక్యంగా ఉండే పరిస్థితి లేనే లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *