Tuesday, 3 November 2026

రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ చెక్‌

భారీగా నగదు స్వాధీనం : ఏకే ఖాన్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) :
రాష్ట్ర వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్‌ తెలిపారు. ఏసీబీ సోదాల్లో రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి చెక్‌పోస్టులోనూ అక్రమాలు బయట పడ్డాయని, చెక్‌పోస్టుల వద్ద కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ఆర్టీఏ సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. ఇవన్నీ సమాచారం అందుకున్నాక దాడులు నిర్వహించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్థరాత్రి నుంచి చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏకే ఖాన్‌ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఏడుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అధికారులతో పాటు వారికి సహకరిస్తున్న ప్రయివేట్‌ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ సవిూపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రవాణాశాఖ చెక్‌పోస్టుపై అనంతపురం ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజాములన దాడులు నిర్వహించారు. ఏఎంవీఐ సుబ్బరాయుడు, కానిస్టేబుల్‌ బాబయ్య, ¬ంగార్డు కిష్టప్ప మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వాహనదారుల నుంచి రూ.53.440 అక్రమంగా వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు భాస్కరరెడ్డి వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు గిరిధర్‌, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. రూ.85 వేలు నగదు స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే సిబ్బందితో పాటు ఉన్నతాధికారులపై విచారణ జరిపిస్తామని ఏకే ఖాన్‌ పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే శాఖలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న అధికారులపై నిఘా ఉంచామన్నారు. ఈ సంవత్సరంలో 334 ట్రాప్‌ కేసులు, 36 తనిఖీ కేసులో, 21 అక్రమాస్తుల కేసులు నమోదు చేశామన్నారు. అవినీతి అధికారులతో పాటు వారిని ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏకే ఖాన్‌ హెచ్చరించారు. సీబీఐ సహకారంతో కేసులు విచారణ మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏసీబీ తనిఖీలను విస్తృతం చేసేందుకు అధునాతన ఎలక్టాన్రిక్‌ పరికరాలను సమకూర్చుంటున్నామని ఆయన తెలిపారు. ఇదిలావుంటే అవినీతి నిరోధక శాఖ వలకు ఖజానా సిబ్బంది చిక్కారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉప ఖజానాధికారిగా పనిచేస్తున్న పద్మిణీ అదే కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శంకర పోలినాయుడు రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒకేసారి ఒక అధికారి మరో ఉద్యోగి ఏసీబీకి చిక్కడంతో మండలానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అవినీతికి అడ్డాగా మారిన ఉప ఖాజానా శాఖ కార్యాలయంలోని అధికారులు ఏసీబీకి చిక్కారనే వార్త మండల వ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్నపనికి లంచం ముట్టచెప్పనిదే ్గ/లు కదిలే పరిస్థితి ఉండేది కాదని వారు అంటున్నారు. ప్రతి నెలా జీతాల బిల్లులకు సైతం ఎంతోకొంత చెల్లిస్తేగాని మంజూరయ్యేవి కాదని చెబుతున్నారు. ఒకే నెలలో మూడు శాఖలకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో జిల్లాలోని అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *