న్యూఢిల్లీ, డిసెంబర్ 21 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ పదవికి రాజీనామా చేసింది. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఓటమితో ఖంగుతిన్న కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే జయంతి నటరాజన్‌ను తిరగి పార్టీలోకి తీసుకుని రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ తన మంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించేందుకే జయంతి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జయంతి వ్యవహరించారు. కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశానుసారం తిరిగి పూర్తీస్థాయిలో పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేందుకే ఆమె కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశంలో సాధారణ ఎన్నికలు సవిూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. యూపీఏ-2 హయాంలో.. చివరిసారి కేంద్రమంత్రివర్గంలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్నికల సమయానికి.. పార్టీని బలోపేతం చేసేందుకు 10 జన్‌పథ్ కసరత్తుచేయడంలో భాగంగా మరికొంతమంది సీనియర్లు కేంద్ర కేబినెట్ వదిలి పార్టీ వ్యవహారాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే జయంతి నటరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. అడవులు, పర్యావరణ శాఖలను ఇకపై కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పర్యవేక్షించనున్నారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్టాల్ర ఎన్నికల్లతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిజోరం మినహా ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దక్కుతుందనుకున్న ఢిల్లీ శాసన సభ కూడా అరవింద్ కేజీవ్రాల్ చీపురుతో ఊడ్చిపెట్టుకుని పోయే సరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు తలలు పట్టుకున్నారు. దాంతో రానున్న లోక్‌సభ ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు చేపట్టవలసిన చర్యల కోసం చర్చించారు. దీంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు కీలక వ్యక్తులను మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని నిర్ణయించారు. అందులోభాగంగానే కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శనివారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను కూడా రాష్ట్రపతి వెంటనే రాజీనామా చేశారు. అంతా చకచక జరిగిపోయాయి. అయితే జయంతిని అనుసరించి మరో 10 మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీమానా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు రాజీనామా బాట పట్టనున్న 10 మంది కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, ఏకే ఆంటోనీ, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నట్లు సమాచారం. వీరంతా ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపుకోసం అవసరమని కాంగ్రెస్ అధినేత్రి భావిస్తున్నారు.
పార్టీ పని కోసం జయంతి నటరాజన్ రాజీనామా




