కొలువుదీరనున్న కొత్త మంత్రులు వీరే
న్యూఢిల్లీ, డిసెంబర్ 24 (జనంసాక్షి) :
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన జట్టును ఎంపిక చేసుకున్నారు. మంత్రివర్గంలో ఏడుగురికి చోటు కల్పించారు. కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరుల పేర్లను మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్, సోమనాధ్, రాకీ బిర్లా, సౌరవ్ భరద్వాజ్, సోమనాధ్ భారతి, గిరీష్ సోనీలకు మంత్రి పదవులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 26న సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనవరి తొలివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అంతేగాక జనవరి 3న అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. జనవరి 6న గవర్నర్ జంగ్ అసెంబ్లీలో ప్రసంగించనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆప్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బీజేపీ చేసిన ఆరోపణలపై కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. తాము ఏ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నదీ వివరిస్తూ ఆమ్ ఆద్మీ మంగళవారం ఒక వీడియోను విడుదల చేసింది. ఏడు భాషల్లో దీనిని విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బయటనుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నదని, తమ రెండు పార్టీలకూ మధ్య ఎటువంటి ఒప్పందాలూ లేవని ఆ పార్టీ వివరించింది. కాంగ్రెస్ పార్టీ గనక తమకు మద్దతు ఉపసంహరించుకోవదలిస్తే ఉపసంహరించుకోవచ్చునని, అటువంటప్పుడు తాము మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నది.బేజీపి అయితే ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతోందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో ఒక పావుగా మారిపోయిందని కూడా బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బాణంగా మారిపోయిందని కూడా బీజేపీ నిప్పులు చెరిగింది. ఇక ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ తనదైన ప్రత్యేకత కనబరుస్తున్నారు. వీఐపీగా ప్రత్యేక భద్రత కల్పిస్తామన్న పోలీసులకు సోమవారం వద్దని చెప్పిన ఆయన ఈరోజు అధికారిక నివాసం కూడా అవసరం లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ డీఎం సపోలియా ఉదయం కేజీవ్రాల్‌ను కలిసి అధికారిక నివాసం విషయం చర్చించారు. అలాంటిది తనకు అవసరం లేదని అరవింద్ కేజీవ్రాల్ ఆయనకు సర్దిచెప్పి పంపించారు. వీఐపీ సంస్కృతికి తిలోదకాలివ్వడం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. దాని అమలు ఆప్ బృందం ఇప్పటికే ప్రారంభించింది.
కేజ్రీవాల్ జట్టు ఎంపిక




