న్యూఢిల్లీ, డిసెంబర్ 25 (జనంసాక్షి):
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం లక్నో చేరుకున్నారు. ముందుగా ఆయన ఢిల్లీ వచ్చి ఇక్కడి నుంచి లక్నో బయలుదేరారు. రెండు రోజులు లక్నోలో గడిపిన అనంతరం ఆయన మళ్ళీ ఢిల్లీ రాబోతున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం అవతరణ విషయంలో ఆనాటి అసెంబ్లీలో ఎటువంటి సమస్మలు వచ్చాయో, వాటిని ఎలా పరిష్కరించారో అధ్యయనం చేయడమే లక్ష్యంగా నాదెండ్ల లక్నో చేరుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర విభజన విషయంలో అప్పట్లో ఎంత మంది ఆక్షేపణ తెలియజేశారు, ఎంతమంది ఆమోదం తెలియజేశారు, అసలు విభజన అంశంపై ఓటింగు ఎలా జరిగింది, అప్పుడు అనుసరంచిన పద్ధతులు ఏమిటి మొదలైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఆయన లక్నో పర్యటన పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఆయనతో పాటు వెంట కొందరు అధికారులు కూడా వచ్చారు. ఆనాటి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో పాలనాపరంగా తీసుకున్న చర్యల గురించి, ఈ విషయంలో ఢిల్లీకి, లక్నోకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి ఈ అధికారులు తెలుసుకుంటారు. అనంతరం వీరంతా ఢిల్లీకి తిరిగి వచ్చి పాలనాపరంగా ముఖ్యమైన వారిని కలుసుకుంటారని తెలుస్తున్నది.
స్టడీ టూర్ లక్నోలో స్పీకర్ నాదెండ్ల




