Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై ఆంక్షలొద్దు

గడువు పెంచొద్దు
రాష్ట్రపతిని కోరిన కేసీఆర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి) :
హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు వద్దని, తెలంగాణ ముసాయిదాపై అసెంబ్లీలో చర్చకు గడువు పెంచొద్దని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. గురువారం రాత్రి 30 మంది టీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కలిసి కేసీఆర్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ప్రస్తుతం ఉన్న పదేళ్ల ఉమ్మడి రాజధాని, శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారాలు గవర్నర్‌కు అప్పగింత, జనాభా ప్రాతిపదికన పింఛన్ల పంపిణీ తదితర ఆంక్షలను సవరించాలని కోరినట్లు చెప్పారు. ఉద్యోగులకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరామని అన్నారు. ఈ దశలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు జగన్‌ తాపత్రయ పడుతున్నారని హరీశ్‌ విమర్శించారు. అసెంబ్లీ చర్చించకుండానే చర్చ పొడిగించాలని కోరడం తెలివితక్కుతనమన్నారు. శాసనసభ, మండలిలో చర్చ ప్రారంభించాక సమయం పొడగించిమని కోరితే అర్థముండేదని, అసలు చర్చే ప్రారంభించకుండా అడ్డుకొని సమయం సరిపోదని గగ్గోలు పెట్టడం తెలంగాణను అడ్డుకునేందుకేనని ఆరోపించారు. చర్చ కోసం గడువు పొడిగించమనే హక్కు సీమాంధ్ర నేతలకు లేదన్నారు. శాసనసభ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌కు పూర్తి అవగాహన ఉందని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. అసెంబ్లీలో విభజనపై చర్చ జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చ జరుగకుంటే తెలంగాణకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, సీమాంధ్ర ప్రజలకే నష్టమని తెలిపారు. 28 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఎలా వ్యవహరించారో తెలంగాణ ఏర్పాటు సందర్భాంగానూ అలాగే వ్యవహరించాలని కోరామన్నారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *