సచ్చీలురైన అధికారులతో సాగుతాం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 26 (జనంసాక్షి) :
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఢిల్లీలో సుపరిపాలన అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తాము నిజాయతీపరులు, సమర్థులైన వారికోసం అన్వేషిస్తున్నామని,అలాంటి వారు ఢిల్లీలో చాలామంది ఉన్నారని కేజీవ్రాల్ అన్నారు. వారికే తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తామని అలాంటి వారిని వెదికిపట్టుకునేందుకు తమ వద్ద ప్రత్యేక బృందం ఉన్నట్లు కేజీవ్రాల్ చెప్పారు. గురువారం ఉదయం జనతా దర్బార్ నిర్వహించిన కేజీవ్రాల్ శనివారం జరిగే తమ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీఐపీలంటూ ఎవరూ ఉండరని, అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ఇక్కడ సిఎంగా తాను ప్రమాణం చేయడం లేదని, అలాగే మంత్రులెవరూ ప్రమాణం చేయడం లేదన్నారు. వీరంతా ప్రజలేనని అన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాలంటూ ఆయన ఢిల్లీ ప్రజలను ఆహ్వానించారు. ఇందుకు అన్నాహజారేను, కిరణ్ బేడీని, సంతోష్ హెగ్డేను ఆహ్వానించామని అన్నారు. రామ్‌లీలా మైదానంలో వనివారం కార్యక్రమం ఉంటుందన్నారు. తాము ప్రకటించిన విధంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయం ఒక కొలిక్కి రావడం వల్లనేమో కేజీవ్రాల్ ఈ సమావేశంలో రిలాక్స్‌డ్‌గా కన్పించారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉందన్న కేజీవ్రాల్ చలివల్ల ఉదయపు నడకకు వెళ్లలేకపోతున్నానన్నారు. స్వెటరు, మప్లరు దుస్తులు ధరించి ఆయన జనతాదర్బారులో పాల్గొన్నారు.
సుపరిపాలన అందిస్తాం




