కన్నీటి సంద్రమైన కాచాపూర్
నివాళులర్పించిన ప్రజా సంఘాల నేతలు
ముగిసిన భూమయ్య అంత్యక్రియలు
కరీంనగర్/పెద్దపల్లి, డిసెంబర్ 26 (జనంసాక్షి) :
జీవితాన్నే తెలంగాణ సాధన ఉద్యమానికి అంకితం చేసి, ఆ కల సాకారమయ్యే వేళ అనుమానాస్పదస్థితిలో ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్యకు ఉద్యమాభివందనాలతో తుది వీడ్కోలు పలికారు. భూమన్న అమర్‌రహే నినాదాలతో కాచాపూర్ దద్దరిల్లింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందన భూమయ్య మృతదేహాన్ని బుధవారం కరీంనగర్ మీదుగా ఆయన స్వగ్రామం పెద్దపల్లి డివిజన్‌లోని జూలపల్లి మండలం కాచాపూర్‌కు తీసుకువచ్చారు. పది జిల్లాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో కాచాపూర్‌కు తరలివచ్చి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. భూమయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఈ సందర్భంగా ఉద్యమకారులు ఆరోపించారు. విప్లవకవి వరవరరావు, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు హమీద్, నందిని సిధారెడ్డి, దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, సిపిఐ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జెవి చలపతిరావు, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి రాజన్నలు పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జెవి చలపతిరావు మాట్లాడుతు ఆకుల భూమయ్య తన విద్యార్ధి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొంటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, రాజహింస వ్యతిరేకంగా పీడిత ప్రజల కోసం అనే ఉద్యమాలు చేస్తూ దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆకుల భూమయ్య మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియల్లో ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రెసిడెంట్ నరేష్, పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యాక్షురాలు మంగ సిపిఐ న్యూడెమోక్రసీ నాయకులు వెంకన్న మల్లేష్ రాజేష్ చిలుక శంకర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. భూమయ్య చితికి ఆయన ముగ్గురు కూతుళ్లు నిప్పటించారు.





