Tuesday, 3 November 2026

భూమిపై లభ్యమయ్యే నీటిలో ఒక్కశాతమే తాగడానికి యోగ్యం

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ
ముంబయి, డిసెంబర్‌ 27 (జనంసాక్షి) :
భూమిపై లభ్యమయ్యే నీటిలో ఒక్కశాతం మాత్రమే తాగడానికి యోగ్యమైనదని, మిగతా 99 శాతంలో అత్యధికం ఉప్పునీరేనని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన 66వ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీర్స్‌ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాస్త్రసాంకేతిక రంగం, ముఖ్యంగా రసాయన పరిశ్రమల రంగం అందివస్తున్న అధునాతను రంగరించుకొని 15 శాతం వృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. భారత కెమికల్‌ ఇండస్ట్రీ 108 బిలియన్‌ డాలర్లతో అంతర్జాతీయ మార్కెట్‌లో మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2017 నాటికి ఈరంగం 290 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను సొంతం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాధిస్తున్న ప్రగతి ఆధారంగా మానవ వనరుల్లోనూ నైపుణ్యాల పెంపుదలకు ప్రణాళికలు రూపొందించాలని, జాతీయోత్పత్తిలో కెమికల్‌ ఇండస్ట్రీ పాత్రను పెంచాలని కోరారు. స్థూల జాతీయోత్పత్తిలో కెమికల్‌ ఇండస్ట్రీ 0.5 శాతానికి తగ్గకుండా వృద్ధి రేటు సాధించాలని, అంతర్జాతీయ మార్కెట్‌లో మన రసాయన పరిశ్రమల రంగం నాలుగు శాతం వృద్ధి రేటు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. అధనంగా ఐదు మిలియన్ల నైపుణ్యత కలిగిన మానవ వనరులను సృష్టించాలని అన్నారు. 2017 నాటికి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక సంస్థలు నైపుణ్యాలు పెంపొందించడం, పరిశోధనలు విస్తృత పరచడం, మౌలిక వసతుల సృష్టి, వృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. కెమికల్‌ ఇండస్ట్రీ స్వయం సమృద్ధిగల సంస్థలుగా ఎదగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహద పడాలని పిలుపునిచ్చారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలను ఇష్టం వచ్చినట్లుగా భూమిపై వదిలేస్తుండటంతో దాని వల్ల నీరు, భూమి, పర్యావరణం కలుషితమవుతున్నాయని తెలిపారు. వ్యవసాయరంగంలో గణనీయమైన వృద్ధి రేటు సాధించడంతో పాటు రక్షితమైన ఎరువులు, క్రిమిసంహారకాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *