అసెంబ్లీకి ఆ హక్కు లేదు : శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 28 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుపై ఓటు వేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని, అది పార్లమెంట్‌కే సొంతమని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ఈ విషయం అందరికీ తెలుసని అయినా ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాల తరవాత ఇప్పుడు అధినేత్రి సోనియా తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ నేతలు కట్టుబడి ఉండాలన్నారు. అభ్యంతరాలు ఉంటే చెప్‌ఆపలే తప్ప చర్చకు రాకపోవడం సమంజసం కాదన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు-2013పై అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లుపైనే అసెంబ్లీలో ఓటింగ్ ఉంటుందికాని, కేంద్ర ప్రభుత్వం చేసిన తెలంగాణ బిల్లువంటి వాటిపై ఓటింగ్ చేసే అధికారం ఉండదని వివరించారు. అసలు అలాంటి బిల్లుపై అసెంబ్లీలో చర్చించే ఆస్కారమే లేదని తెలిపారు. తెలంగాణ బిల్లును ఆమోదించే, తిరస్కరించే అధికారం కేవలం పార్లమెంట్‌కే ఉందని వెల్లడించారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ కేవలం అభిప్రాయం మాత్రమే తెలపాలన్నారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా రాష్ట్రపతికి పంపితే సీమాంధ్ర నేతలు చారిత్రక తప్పిదం చేసిన వారవుతారని పేర్కొన్నారు. ఇదిలావుంటే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా పర్యటించడంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన రాష్ట్ర విభజన అంశంపై అధ్యయనం చేసేందుకు ఒంటరిగా యూపీలో పర్యటించడంలో అంతర్యమేంటని నిలదీస్తున్నారు. ఆయన ఒంటరి పర్యటన వలన ఎవరికి లాభమని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ ఏకపక్ష పర్యటనపై అనుమానాలున్నాయని అన్నారు. స్పీకర్ లేనపుడు స్పీకర్ స్థానంలో కూర్చునే డెప్యూటీ స్పీకర్‌ను ఎందుకు తీసుకెళ్లలేదని వారు ఆరోపిస్తున్నారు. డెప్యూటీ- స్పీకర్ తెలంగాణ ప్రాంతం వాడే కాబట్టి ఆయనను తీసుకెళ్లలేదని విమర్శిస్తున్నారు. ఇక్కడ కూడా సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శించారని దుయ్యబట్టారు. విభజన సమయంలో సభను ఎలా నిర్వహించాలో తెలుసుకునేందుకే అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, చీఫ్ విప్ తదితరులను తీసుకెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు.
బిల్లుపై ఓటింగ్ పార్లమెంట్‌కే




