Tuesday, 3 November 2026

సీఎంతో భేటీ.. తేలని భృతి

పెదవి విరిచిన ఉద్యోగ సంఘాలు
తక్షణం ప్రకటించండి : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిపై సీఎం కిరణ్‌తో ఉద్యోగ సంఘాల నాయకులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మధ్యంతర భృతిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా ఉద్యోగులకు తెలిపారు. శనివారం సచివాలయంలోని తన బాంబర్‌లో 29 ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మధ్యంతర భృతిపై ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తోందని అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాక రూ.9వేల బకాయిలు చెల్లించామని చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుత రెవెన్యూ తగ్గిపోయిందని, అన్ని విధాలా ఆలోచించి భృతిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నూతన సంవత్సరం కానుకగా తీపికబురు అందుతుందని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూసినప్పటికీ ఆ ఆశ నిరాశగానే మిగిలింది. దీనికి సంబంధించిన బంతి సీఎం కోర్టులో ఉన్నప్పటికీ, ఐఆర్‌ ప్రకటనకు మాత్రం ముహూర్తం ఖరారు కాలేదు. పదో పీఆర్సీ ఆలస్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యంతర భృతి కోసం డిమాండ్‌ చేయడం తెలిసిందే. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు జీతాలు పెరగక ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ప్రభుత్వం దీనిపై దోబూచులాటలు ఆడుతోందని వారు విమర్శించారు. ఐఆర్‌పై కొంతకాలంగా ఉద్యమం జరుపుతున్న ఉద్యోగులు మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారు. అనంతరం కేబినెట్‌ సబ్‌కమిటీతో చర్చలు జరిపారు. చివరకు ఈ ఫైలు ముఖ్యమంత్రి చాంబర్‌కు చేరడంతో తుదినిర్ణయం ఆయనే తీసుకోవాలసి ఉంది. వాస్తవానికి మధ్యంతర భృతి అంశంపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఉద్యోగులు 45 నుంచి 50 శాతానికి ఐఆర్‌ను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్‌ను పరిశీలించిన ప్రభుత్వం ఎంత అందించాలన్న దానిపై పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మధ్యంతర భృతి నిర్ణయం జరగాల్సి ఉండగా, సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో సిఎంతో సమావేశం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆరోగ్య కార్డు అంశంతో చర్చ పక్కదారి పట్టింది. దీంతో ముఖ్యమంత్రి మరోసారి సమావేశం జరుపుదామని చెప్పడంతో ఉద్యోగ సంఘాల నాయకులు అసంతృప్తితో సమావేశం నుంచి వెనుదిరిగారు. మధ్యంతర భృతిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, 45 శాతం ఐఆర్‌ ఇవ్వాలని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *