Tuesday, 3 November 2026

మేడమ్‌ మాటిచ్చారు


ఫిబ్రవరిలో తెలంగాణ
డెప్యూటీ సీఎం రాజనర్సింహ
సీఎం బౌలింగ్‌ ఎదుర్కొంటాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) :
మేడమ్‌ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు.. ఆమె ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఫిబ్రవరి నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. నగరంలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ-2014ను రాజనర్సింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణపై సీమాంధ్ర నేతలు చేస్తున్నదంతా విష ప్రచారమేనని తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి సొంత బలాన్ని పెంచుకునేందుకే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య రాష్ట్రం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సమైక్యరాష్ట్రమంటున్న సీమాంధ్ర నేతలు 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోల్లో పెట్టినపుడు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్రో ఎంతో కీలకమని అన్నారు. టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తథ్యమే అయినా ప్రక్రియ పూర్తయ్యేవరకూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లులో సవరణలు కోరుతూ జనవరి 7న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించనన్నుట్లు ఆయన తెలిపారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గమైనవని ఆయన పేర్కొన్నారు. సీఎం చివరి బంతి వరకు ఉంటాడో.. ఆయన దగ్గర ఎన్ని బంతులున్నా వాటిని సమర్థంగా ఎదుర్కొనే ధీరులు తెలంగాణలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వేసే చివరి బంతి దూస్రా అయినా, గూగ్లీ అయినా, యార్కరైనా సమర్థంగా తిప్పికొడతామని కోదండరామ్‌ చమత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, దేవిప్రసాద్‌, విఠల్‌, రఘు, శ్రీనివాస్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *