
హైదరాబాద్, డిసెంబర్ 29 (జనంసాక్షి) :
ఆడపిల్లే సృష్టికి ఆధారమని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. నగరంలో జూబ్లీహిల్స్ గల కేబీహెచ్ పార్కు వద్ద నాటా ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో నిర్వహించిన నడక కార్యక్రమాన్ని ఆమె డీజీపీ ప్రసాద్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ, ప్రపంచం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో జరుగుతున్న భ్రూణ హత్యలు సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేస్తున్నాయన్నారు. శాస్త్రసాంకేతిక రంగాన్ని ఆడపిలల్లను అంతమొందించడానికి వాడుకోవడం దారుణమన్నారు. అలాంటి చర్యలకు పాల్పడే వారు వైద్య వృత్తికే ద్రోహం చేసినవారవుతారని ఆమె మండిపడ్డారు. అలాగే బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల నివారణకు మనుషుల ఆలోచన ధోరణుల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో పెచ్చుమీరుతున్న ఈ ధోరణులను ఎంతమొందించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలను గర్భంలోనే చంపే నీచానికి దిగజారవద్దని కోరారు. ఈ సందర్భంగా యువత ఆడపిల్లల్ని కాపాడదామంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
ఆడపిల్లే సృష్టికి ఆధారం మంత్రి డీకే అరుణ




