Monday, 2 November 2026

మాటపై నిలబడ్డ కేజ్రీవాల్‌

ఉచిత నీటిపైనే మొదటి చేవ్రాలు
కుటుంబానికి 700 లీటర్ల తాగునీరు
విద్యుత్‌ బిల్లులపై తర్వాతి దృష్టి
అనారోగ్యంతో విధులకు కేజ్రీవాల్‌ దూరం
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) :
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించిన మూడు రోజులు కూడా గడవక ముందే ఇంటింటికి ఉచితంగా నెలకు 20 కిలోలీటర్ల నీటిని అందజేసే దస్త్రంపై మొదటి సంతకం చేశారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ప్రకటన జారీ చేశారు. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నీటి కనెక్షన్లు, మీటర్లు ఉన్న ప్రతి ఇంటికి ఉచిత నీటిని అందించనున్నారు. పరిమితికి మించి వాడుకుంటే బిల్లు చెల్లించాల్సిందేనని వివరించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ప్రచార సమయంలో అమాద్మీ పార్టీ తరఫున కేజ్రీవాల్‌ తమ పార్టీని గెలిపిస్తే ఇంటింటికి 700 లీటర్ల ఉచిత నీటిని అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ వాటర్‌ బోర్డు సోమవారం సాయంత్రం కేజీవ్రాల్‌ నివాసంలో సమావేశమయ్యింది. అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఇంటివద్దనే సమావేశాలు నిర్వహించారు. తాను ఆదివారం నుంచి 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నానని, కార్యాలయానికి హాజరుకాలేకపోతున్నానని కేజీవ్రాల్‌ ఉదయం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకే అధికారులతో తప్పని పరిస్థితిలో ఇంట్లో సమావేశమయ్యారు. ఇదిలావుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయినా, అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం సచివాలయంలోకి విూడియాను అనుమతించకపోవడంతో సోమవారం నిరసన వ్యక్తమైంది. విూడియా సెంటర్‌ వరకు మాత్రమే విలేకరులు వెళ్లవచ్చని, మంత్రుల గదులవద్దకు వెళ్లడానికి వీల్లేదని పేర్కొనడంతో విూడియా ఆప్‌ ప్రభుత్వ కార్యక్రమాల్ని బహిష్కరించింది. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ను ప్రశ్నించగా ఏం జరిగిందో తెలుసుకుంటానని చెప్పి ఆయన విలేకరుల సమావేశంనుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. సెక్రెటేరియట్‌లోకి ప్రజలెవరైనా ఎలాంటి పాసులు అవసరం లేకుండా వెళ్లవచ్చని గతంలో ఆప్‌ ప్రకటించింది. మరోవైపు కేజీవ్రాల్‌ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయన రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ఈ సందర్భంగా వైద్యుడు బిపిన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ కేజీవ్రాల్‌ డయేరియాతో బాధపడుతున్నారని, ఆయనకు విశ్రాంతి అవసరమని తెలిపారు. కేజీవ్రాల్‌ గత నెలరోజుల నుంచి దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. తనను కలిసేందుకు వచ్చినవారిని కూడా ఆయన జ్వరం కారణంగా కలవలేకపోయారు. సిఎంకు అనారోగ్యంపై ఆయన సహచరులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *