Monday, 2 November 2026

శాఖ మార్చడం అప్రజాస్వామికం : జానారెడ్డి

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీ మంత్రులు
బాధ్యతాయుతంగా వ్యవహరించా : శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) :
మంత్రి శ్రీధర్‌బాబుకు శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం అప్రజాస్వామికమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణకు చెందిన మంత్రులు జనారెడ్డి నివాసంలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణకు రంగం సిద్ధం చేశారు. రాజ్యాంగ పక్రియను అడ్డుకోవాలనే కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. బిల్లు పక్రియను హైజాక్‌ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.మరోవైపు మంత్రి శ్రీధర్‌బాబు దీనిని అవమానంగా భావించి రాజనీమాకు సిద్దపడ్డారు. ఆయనను మరోమంత్రి జానారెడ్డి వారించారు. దీనివల్ల తెలంగాణ ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావించారు. శాఖమార్పుతో మంత్రివర్గంకు రాజీనామా చేయాలని శ్రీధర్‌బాబు నిర్ణయం తీసుకున్నారని, కానీ తామే వారించమని జానా చెప్పారు. తమ చర్యలతో విభజనకు ఆటంకం కలగూడదని సంయమనం పాటిస్తున్నట్లు ఆయన వివరించారు. శ్రీధర్‌బాబు శాఖమార్పు విషయాన్ని హైకమాండ్‌కు తెలియజేసినట్లు మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుంటే శాఖ మార్చడం తనకున్న స్వేచ్ఛ అని సిఎం చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖను కేటాయించడం ద్వారా బలోపేతం చేయాలని చూశామని అన్నారు. తనతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాఖల మార్పు గురించి తనతో చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సమర్థులు చాలామంది ఉన్నారని, వాణిజ్య పన్నుల శాఖను వారికి అప్పగించాలని ఆయన సూచించారు. తన నిర్ణయాన్ని సహచర మంత్రులకు చెప్పానని, అందరం కలిసి సమష్టి నిర్ణయంతో ముందుకెళ్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. తన శాఖ మార్పుపై శ్రీధర్‌బాబు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. తాడో పేడో తేల్చుకోవడానికి తాను సిద్ధమేనని సహచర మంత్రుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో మంత్రులు శ్రీధర్‌బాబు, జానారెడ్డి సమావేశమై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. కొందరు తెలంగాణ మంత్రులు ఇప్పటికే శ్రీధర్‌బాబుపై వేటు విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. మంత్రి శ్రీధర్‌బాబు మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పు నేపథ్యంలో ఉదయం మంత్రి జానారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానారెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రుల భేటీ అనంతరం ఆయన డీఎస్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పీసీసీ మాజీ అధ్యక్షులు డీఎస్‌ అన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర విభజన పక్రియ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య భావసారూప్యం ఉందని డీఎస్‌ అన్నారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును తాము ప్రశ్నించడం లేదని, జరిగిన వ్యవహారం తీరునే తాము ప్రశ్నిస్తున్నామని మంత్రి జానారెడ్డి అన్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం జానారెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. సిఎం తీరును ఎదుర్కొనేందుకు వారు చర్చించారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేయరాదని నిర్ణయించారు. సీఎం చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. శ్రీధర్‌బాబు రాజీనామా చేస్తానన్నారని, తాము అడ్డుకున్నామని జానారెడ్డి చెప్పారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా పక్రియ వేగవంతమవుతోందన్నారు. శాసనసభలో సమైక్య, విభజన తీర్మానాలకు అర్థం లేదన్నారు. అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఎవరూ అడ్డుకోలేరని జానారెడ్డి పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన శని గ్రహమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. శ్రీధర్‌బాబు శాఖను మార్చడమంటే తెలంగాణ ప్రజలను కించపర్చడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేసి కాంగ్రెస్‌కు పట్టిన శనిని వదిలించాలని ఆయన సూచించారు. సిఎం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ రెచ్చగొట్టుడు చర్యేనని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని సమైక్యాంధ్ర జేఏసీ కార్యాలయంగా మార్చారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆయన బాహాటంగా తెలంగాణ వ్యతిరేక కుట్రలుచేస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు తెలంగాణ మంత్రులు ఆయనతో సఖ్యతగా ఉండడం తగదన్నారు. సిఎం తీసుకున్న నిర్ణయంపై ఎంపీలో పొన్నం ప్రభాకర్‌, పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డిలు మండిపడ్డారు. ఇది దారుణమైన నిర్ణయమన్నారు. తెలంగౄణవాదులను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరి కొనసాగిస్తున్న సిఎం తెలంగాణ ఏర్పాటును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతానని సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నాటి నుంచి చెబుతూనే ఉన్నారు. అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారు. సీడబ్ల్యుసీ నిర్ణయం కంటే ముందు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న కిరణ్‌.. సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత అధిష్ఠానాన్ని వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను జరుగనీయబోనని ప్రతినలు చేశారు. ఆ తీరును కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల ఆందోళనలు, సమ్మె వెనుక సీఎం హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ని జరిగినా పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీకి చేరుకోవడంతో సీమాంధ్ర నేతలు తమ కుట్రలకు మరింత పదును పెట్టారు. సీమాంధ్ర నేతలు ఏకపక్షంగా సభలో సమైక్య తీర్మానం చేయించేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీకి రాష్ట్రపతి పంపిన ముసాయిదాపై అభిప్రాయాలు కోరారు తప్పించి ఓటింగ్‌ను కోరలేదని, కనుక సమైక్య తీర్మానం ప్రభావం ఏమీ ఉండబోదని తెగేసి చెబుతున్నారు. ఈ దశలో అసెంబ్లీలో వ్యవహారం తన కనుసన్నల్లో జరిగేలా సిఎం పావులు కదుపుతున్నారు. అసెంబ్లీలో బిల్లుపై డిసెంబర్‌ 23నాటికి చర్చ ముగించాలని బీఏసీ చేసిన నిర్ణయానికి భిన్నంగా జనవరి 23 వరకు సమావేశాలను పొడిగించారు. ఈ మేరకు సీఎం అసెంబ్లీ షెడ్యూల్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. మెజార్టీ బీఏసీ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను పొడిగించిన సీఎం కిరణ్‌ జవనరి 3 నుంచి ప్రారంభమయ్యే మలివిడత సమావేశాలలో కూడా బిల్లుపై చర్చ జరుగకుండా అడ్డుకోవడానికే మంత్రి శ్రీధర్‌బాబు నుంచి శాసన సభ వ్యవహారాల శాఖను తప్పించి సీమాంధ్ర ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌, మంత్రి సాకె శైలజానాథ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విభజన బిల్లుపై ఈ నెల 3 నుంచి శాసనసభలో చర్చలు ప్రారంభం కానున్నాయి. నేపథ్యంలో శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం తెలంగాణ ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేని అంశం.సీఎం వైఖరిని నిరసిస్తూ గతంలో ఒకదశలో తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచించారు. కానీ విభజన బిల్లు వచ్చిన నేపథ్యంలో మంత్రులుగా కొనసాగడమే మేలని వారు భావించారు. ఇప్పుడు శ్రీధర్‌బాబును తప్పించడంతో వారు సమావేశమై ఏం చేయాలా అన్నది నిర్ణయించుకోనున్నారు. 3న జరిగే సమావేశంలో తుద ఇనిర్ణయం తీసుకుంటామని జానారెడ్డి చెప్పారు. అయితే సీఎం నిర్ణయాన్ని ఆనం బ్రదర్స్‌ మాత్రం సమర్థించగా మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గట్టిగా వ్యతిరేకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *