తెలంగాణ గుండెపై గునపం
- ముందు చూపుతో నిజాం ఉంచిన భూముల్ని నిండా ముంచిన వైఎస్సార్
- అటవీశాఖ అనుమతుల్లేకుండా నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు భూమి అమ్మేశారు
- వాక్ వేను మధ్యలో తవ్వేశారు
- సీలింగ్ యాక్టును తుంగలో తొక్కేశారు
అక్కడ పక్షుల కువకువలు.. నెమళ్లు నాట్యం చేస్తాయి. వందల రకాల ఆయుర్వేద మొక్కలు వేల సంఖ్యల్లో జంతుజీవ రాశులకు అది నెలవు. అది నల్లమలో.. దండకారణ్యమో కాదు. నగరం నడిబొడ్డున ఉన్న నిజాం కాలం నాటి పార్కు. దానికి సీమాంధ్రులు ముద్దుగా కేబీఆర్‌గా నామకరణం చేశారు. సహజ అడవిగా ప్రకటించి అటవీశాఖకు అప్పజెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మధ్య ఉన్న ఈ సహజ వనరుల గుట్టపై సీమాంధ్ర సర్కారు విషపు కన్నుపడింది. ఆరోగ్యం కోసం.. ఆనందం కోసం మానసికోల్లాసం ఉన్న ఈ చిట్టడివి ఓ మూలను నగరంలోని భూములన్నీ కారుచౌకగా అమ్మేసిన అనకొండ వైఎస్సార్ కన్నుపడింది. గత కొంతకాలంగా ఈ భూమిలో పనులు ఆగినా మళ్లీ ఇప్పుడు షరవేగాన్నందుకున్నాయి. ఏమిటీ కథాకమామిషు… ఈ స్టోరీ చదవండి…
హైదరాబాద్, జనవరి 2 (జనంసాక్షి) :
వలస పాలకులు తెలంగాణ గుండెపై గునపాన్ని గుచ్చారు. ముందు చూపుతో నిజాం ఉంచిన భూముల్ని వైఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అటవీశాఖ అనుమతుల్లేకుండా నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు స్థలాన్ని వైఎస్సార్ సర్కారు ఇష్టారాజ్యంగా అమ్మేసింది. తన తాత జాగీరు అన్నట్టుగా సీమాంధ్ర సంస్థకు అప్పనంగా కట్టబెట్టింది. ఫ్లాట్లు కట్టుకొని అమ్మేసుకోమంటూ రాసిచ్చేసింది. ఓపెన్ ఆక్షన్‌లోనే సదరు స్థలాన్ని అమ్మినట్టు ఓ కలర్ ఇచ్చింది. బహిరంగంగానే స్థలాన్ని అమ్మకానికి పెట్టినట్టు తననెవరూ ప్రశ్నించకూడదన్నట్టుగా వ్యవహరించింది. నగరంలోనే అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎంతో విలువైన సుమారు ఆరెకరాల స్థలాన్ని, ప్రజోపయోగ పనుల కోసం నిజాం అప్పగించిన భూమిని ఓ ప్రైవేటు సంస్థకు దారాదత్తం చేసింది. సదరు సంస్థ జాతీయ ఉద్యానవనంలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం నుంచి వేలంలో కొన్న స్థలానికి మరో ఎకరం అధనంగా ఆక్రమించుకొన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్. వీవీఐపీలు నివసించే ప్రాంతం. ఒకప్పుడు చిట్టడివిలా ఉన్న ఈ ప్రాంతంలో 1960లో ముఖరమ్ జా చిరాన్ ప్యాలెస్ నిర్మాణానికి పూనుకున్నాడు. అతడి తండ్రి అజమ్ జా దాని చుట్టు పక్కల గల 400 ఎకరాల స్థలాన్ని ముఖరమ్‌కు బహుమానంగా ఇచ్చాడు. ఈ స్థలంలో ఉద్యానవనంతో పాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు పూనుకున్నారు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత ల్యాండ్ సీలింగ్ ఆక్ట్ కింద ఈ స్థలాన్ని నిజాం వారసులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. మిగులు భూమిగా ప్రభుత్వానికి బదలాయించిన ఈ స్థలంలో ప్రజోపయోగ నిర్మాణాలు మాత్రమే చేపట్టాలి. చిరాన్ ప్యాలెస్ వద్ద అప్పటికే ఉన్న ఉద్యానవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉద్యనవనం, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించింది కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆమోదంతో 1998లో ప్రభుత్వం ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. 390 ఎకరాల విస్తీరణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో 600 వృక్షజాతులు, 140 రకాల పక్షులు, 30 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది వీటిలో ప్రత్యేక మైనవి.
నగరం విస్తరణతో పాటు జనాభా పెరిగిపోయింది. ప్రజల అవసరాలకనుగుణంగా వాహనాల సంఖ్య పెరిగింది. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో వ్యక్తిగత వాహనాల వినియోగం అధికమైంది. శివారు ప్రాంతాల్లో పరిశ్రమల వల్ల, నగరంలో వాహనాల వల్ల కాలుష్యం విపరీతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవనం కాలుష్యం బారినుంచి ప్రజలను ఎంతగానో రక్షిస్తోంది. అలాంటి ఉద్యానవనంపై సీమాంధ్రకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కన్నుపడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి సర్కారు తలలో నాలుకలో వ్యవహరిస్తున్న సత్యం కంప్యూటర్స్ కవల సంస్థ మైటాస్ దీనికి తోడైంది. రెండూ కలిసి జూబ్లీ హిల్స్ నడిబొడ్డున బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సంకల్పించాయి. తాము అడిగింది తరువాయి ఇచ్చేందుకు సిద్ధంగా ఉండే సర్కారు వారి చెప్పుచేతల్లో ఉండటంతో ఇక తమ ప్రణాళిక అమలుకు సన్నద్ధమయ్యారు. తాము కన్నేసిన కేబీఆర్ పార్కులోని ఫిల్మ్‌నగర్ వైపున ప్రధాన రహదారి పక్క స్థలంలో ఫ్లాట్లు కట్టుకునేందుకు ప్రభుత్వ పెద్దలను సంప్రదించాయి. తమ కోరిక వారికి వివరించి పనిచేసిపెట్టమన్నారు. వాళ్లు అడగడమే తరువాయి అన్నట్టుగా వైఎస్ సర్కారు పార్కు స్థలాన్ని కట్టబెట్టడానికి సిద్ధమైంది.
కేబీఆర్ పార్కు స్థలంలో హోటల్, కమర్షియల్ కాంప్లెక్స్, గృహ సముదాయం నిర్మాణానికి రియాల్టీ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈమేరకు ఐసీఐసీఐ వెంచర్, నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, మైటాస్ సంస్థలు బెంగళూర్‌కు చెందిన మంత్రి డెవలపర్స్ 2006 ఫిబ్రవరిలో 335 కోట్లు వెచ్చించి 5.85 ఎకరాల స్థలాన్ని వేలంలో దక్కించుకున్నాయి. నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, మైటాస్ ప్రాపర్టీస్ ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి బహుళ అంతస్తుల నివాస సముదాయాలతో పాటు హోటల్, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించాయి. సదరు స్థలం నిజాం నుంచి ల్యాండ్ సీలింగ్ యాక్టు కింద తీసుకున్నదన్నట్లుగా సదరు సంస్థతో చేసుకున్న ఒప్పందంలోనూ ప్రకటించాయి. నాగార్జున కన్‌స్ట్రక్షన్స్, మైటాస్ ప్రాపర్టీస్, మంత్రి డెవలపర్స్, ఐసీఐసీఐ వెంచర్స్ కలిసి జూబ్లీహిల్స్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(జేహెచ్‌పీఎల్) పేరుతో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి సదరు భూ బదలాయింపు పొందాయి. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలోనే జేహెచ్‌పీఎల్ అతిపెద్ద రియాల్టీ సంస్థగా ఆవిర్భవిస్తుందని మంత్రి డెవలపర్స్ ఈ సందర్భంగా పేర్కొంది. 30 అంతస్తుల నివాస సముదాయం నిర్మాణానికి తమకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి లభించినట్టుగా పేర్కొంది. ఈమేరకు జూబ్లీహిల్స్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వేగంగా నిర్మాణాలు సాగిస్తోంది. ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకొని పార్కు స్థలంలో ఇష్టారాజ్యంగా పనులు చేస్తోంది. పచ్చటి పార్కులో ఈ నిర్మాణం వల్ల వచ్చే కాంక్రీట్ ధూళి వల్ల కాలుష్యం విస్తరిస్తోంది. అరుదైన వృక్షజాతులు, పక్షులు, సీతాకోక చిలకలు, ఇతర జీవాలకు ఈ ధూళి వల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కొన్ని జీవ జాతుల ఉనికికే ప్రమాదం తలెత్తినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్కు స్థలం కావడంతో ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల దందా బయటి ప్రపంచానికి తెలియడం లేదు. జాతీయ ఉద్యనవనానికి, వన్యప్రాణి కేంద్రానికి ముప్పు వాటిల్లే నిర్మాణాల గురించి వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులకు కూడా తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.
ఎంతో అరుదైన వృక్షజాతులకు, పక్షులకు, సీతాకోక చిలుకల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ప్రైవేటు కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలతో పాటు అసలు నిర్మాణం చేపట్టిన స్థలం కేటాయింపే నిబంధనలకు విరుద్ధంగా సాగిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజాం ప్రజావసరాల కోసం అప్పగించిన స్థలాన్ని వ్యాపారానికి కేటాయించడం సీమాంధ్ర పాలకుల దుర్మార్గానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం రియాల్టీ సంస్థకు పార్కు స్థలాన్ని కట్టబెట్టడం వెనుక పెద్ద కుట్రే సాగిందని వారు పేర్కొంటున్నారు. ఈప్రాంత అభివృద్ధికి చిరాన్ ప్యాలెస్ ఎంతగానో దోహదపడిందని, పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందితే సీమాంధ్రులు జూబ్లీహిల్స్ ప్రాంతంలో స్థలాలను కారుచౌకగా కొట్టేశారని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలోనూ పార్కు స్థలాన్ని వైఎస్ సర్కారు సీమాంధ్ర రియాల్టీ సంస్థలకు కట్టబెట్టిందంటే ఇక అంతకుముందు జరిగిన భూపందేరాలను అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకొని ప్రజావసరాలకు ఉపయోగించాలని వారు కోరుతున్నారు. అలాగే పార్కు స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా రియాల్టీ సంస్థలకు కట్టబెట్టిన వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని, వన్యప్రాణులు, వృక్షజాతుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన జూబ్లీహిల్స్ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ లిమిటెడ్ నిర్మాణాలను నిలిపివేయాలని, స్థలాన్ని పార్కుకు తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజాం ఇనాం భూముల అన్యాక్రాంతంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతున్నారు.