టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 (జనంసాక్షి) :
శాసనసభలో తెలంగాణపై చర్చ జరిగినా.. జరగకపోయినా… టీ బిల్లు పంపినా.. పంపకపోయినా ఏం ఫరక్ పడదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆరు నైరైనా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోకాళ్లమీద నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లినా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఆపలేరు, అపలేరు, ఆపలేరు అని కేసీఆర్ నొక్కి చెప్పారు. ఎవరు ఎన్నినాటకాలు ఆడినా, ఎన్ని వేశాలు వేసినా తెలంగాణ ఆగదన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డెయిరీ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. పిడికిడి మందితో మొదలైన తెలంగాణ ఉద్యమం పెద్ద ఉప్పెన అయిందన్నారు. మద్రాస్ నుంచి బయటకు రాకముందే తెలంగాణను కబళించాలని ఆంధ్ర ప్రాంత నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్, లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణల అసలు రంగు బయటపడిందని విమర్శించారు. వారు అప్పుడేం మాట్లాడారో ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణను దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను చెరలో బంధించి మరి దోపిడికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను కబళించడానికే ఆంధ్రోళ్లు మద్రాసుని విడిచిపెట్టారని తెలిపారు. రాష్ట్ర విభజన జరుగుతుంటే తెలంగాణ వాళ్లు ఎలా బతుకుతారని అన్న సీమాంధ్రులు చాలా మందే ఉన్నారని అన్నారు. ఆంధ్రోళ్లే తెలంగాణ ప్రజలను సాదుతున్నట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. విడిపోతే అడుక్కు తింటమన్నట్లు మాట్లాడుతున్నారని, మరి కలిసుంటే దొబ్బి తింటారా? అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇక విబజన ఆగదని, మన తెలంగాణ మనకు వస్తదని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ దూరదృష్టి వల్లనే ఆర్టికల్-3ని రూపొందించారని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ దీనిని అత్యవసరంగా పరిగణించారని కేసీఆర్ అన్నారు. ఈ ఆర్టికల్ అంబేద్కర్ విజ్ఞతకు నిదర్శనమని పొగిడారు. ఆనాడు మద్రాసు నుంచి ఆంధ్రా ప్రజలు విడిపోతామని అన్ననాడు మద్రాసు అసెంబ్లీలో సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు పిడికెడు మందేనని గుర్తు చేశారు. తమిళులు విడిపోయేది లేదంటే ఈనాటికి ఆంధ్రోళ్లు తమిళనాడులోనే ఉండాల్సి వచ్చేదని వివరించారు. మరలాంటపుడు తెలంగాణ విడిపోకుండా ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. మరి సీఎం కిరణ్‌కు జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా? అని నిలదీశారు. ఈ కష్టాలుంటాయనే అంబేద్కర్ ఆర్టికల్-3ని ఏర్పాటు చేశాడన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినా, జరుగకున్నా ఏమీ నష్టం లేదని తెలిపారు. కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణపై ఎంత గీపెట్టినా జనవరి 23 వరకే నని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత విభజన బిల్లుపై నివేదిక పంపాల్సింది చీఫ్ సెక్రటరీయే అని తెలిపారు. సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అనుమానం అసలే వద్దని అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా సీమాంద్ర నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి ఏది అనువుగా ఉంటే అదే మాట్లాడుతారని అన్నారు. తమిళనాడు విడిపోయేప్పుడు ఉన్న న్యాయం తెలంగౄణ విసయంలో ఉండదా అని ప్రశ్నించారు. ఆరునూరైనా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. నేటిది ఎడ్డి తెలంగాణ కాదని, తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్లు కాదని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఫిబ్రవరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని, పార్లమెంట్‌ను ప్రోరోగ్ చేయలేదని స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నేత అద్వానీ చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మన్మోహన్సింగ్, సోనియా తెలంగాణ బిల్లు విషయంపై తమతో టచ్‌లో ఉన్నారని అద్వానీ తెలిపారన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం తెలంగాణ ఏర్పాటుకు కృత నిశ్చయంతో ఉన్నాయని అలాంటపుడు సీఎం తెలంగాణను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. ఫిబ్రవరిలో పార్లమెంటులో బిల్లు పాస్ కావడం ఖాయమని అన్నారు. రాబోయే తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. డైరీ ఆవిష్కరణ కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర నేతలు అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసినంత మాత్రాన తెలంగాణను ఆపలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రతులను సీమాంధ్ర నేతలు చించివేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలందరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరి లక్ష్యం తెలంగాణ ఏర్పాటే కాబట్టి తెలంగాణ ఏర్పాటులో ఎలాంటి జాప్యం ఉండదని ఆయన తెలిపారు. ఒకవేళ జాప్యం జరిగితే, మోసం జరిగితే తెలంగాణ ప్రజలు ఊరుకోరని అన్నారు. మోసం చేసే పార్టీలకు చెందిన జెండాలు తెలంగాణలో ఒక్కటి కూడా ఉండదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉన్న పార్టీలకు, నాయకులకు తగిన గౌరవం ఉంటుందని, ఇక్కడి ప్రజలు పట్టం కడతారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో సోనియా తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ మంత్రులు, నేతలు తెలంగాణ ఏర్పాటు విషయంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలు వృధా కావని, తెలంగాణ తప్పకుండా సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. టీజీవో కార్యాలయంలో జరిగిన ఈ డైరీ ఆవిష్కరణ కార్యాక్రమానికి మంత్రి జానారెడ్డి, ఎంపీ మధుయాష్కీ, దేవిప్రసాద్, రవీందర్రెడిడ్డ తదితరులు హాజరయ్యారు. సంఘం డైరీని కేసీఆర్ ఆవిష్కరించారు. క్యాలెండర్‌ను మంత్రి జానారెడ్డి, మధుయాష్కీ ఆవిష్కరించారు.





