Tuesday, 3 November 2026

సభ విశ్వాసం పొందిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి) :

అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం న్యూఢిల్లీ శాసనసభ విశ్వాసం పొందింది. ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కారు గురువారం నిర్వహించిన విశ్వాసపరీక్షలో విజయం సాధించింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో సర్కారుకు ఆమ్‌ ఆద్మీ (28), కాంగ్రెస్‌ (8) జేడీయూ సభ్యుడు ఒకరు మద్దతు ఇవ్వడంతో విశ్వాసపరీక్ష నెగ్గింది. హుందాగా సాగిన చర్చలో కేజ్రీవాల్‌ తన లక్ష్యాన్ని వివరించారు. తాము ఒక రాజకీయ పక్షాన్ని స్థాపించి ఎన్నికల్లో పోటీచేస్తామని కలలో కూడా అనుకోలేదని కేజీవ్రాల్‌ అన్నారు. ఢిల్లీ విధానసభలో విశ్వాసపరీక్ష తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై పోరాడేవాళ్లంతా తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో వీఐపీ సంస్కృతితో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ సంస్కృతి పోవాలని తాము కోరుతున్నామన్నారు. తన ప్రభుత్వం అవినీతికి పాల్పడే ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. ప్రతి నివేదిక ప్రజల ముందుకు రావాలని,  అందుకనే డిస్కంలపై కాగ్‌ ఆడిట్‌కు ఆదేశించామన్నారు. దేశంలోని రాజకీయాలు అవినీతితో భ్రష్టుపట్టాయని, అవినీతిని రూపుమాపే శక్తి ఆమ్‌ఆద్మీకి మాత్రమే వుందన్నారు. ఢిల్లీలోని అనధికార కాలనీల్లో మౌలికసౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు.  ఢిల్లీలోని జుగ్గీబస్తీల్లో వెలుగులు నింపుతామన్నారు.  సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుందనడానికి ఆప్‌ విజయమే నిదర్శనమన్నారు. నీరు, విద్యుత్‌, రహదారి సమస్యలకు కారణం రాజకీయాలే అన్నారు. స్వాతంత్యం వచ్చినప్పటినుంచి వేలాది కోట్లు ఖర్చవుతున్నా సామాన్యుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ఖర్చు పెట్టే ప్రతిరూపాయి ప్రజలదని రాజకీయనాయకులు గ్రహించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో తాము మార్పుకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *