పీఏ ద్వారా వర్తమానం
నేటి నుంచి అసెంబ్లీ
టీ బిల్లుపై చర్చ
కుట్రలు చేస్తున్న సీమాంధ్రులు
ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న టీ సభ్యులు
హైదరాబాద్, జనవరి 2 (జనంసాక్షి) :
శాసన సభ వ్యవహారాల శాఖ నుంచి తనను తప్పించడంతో రాజీనామాకు సిద్ధపడ్డ శ్రీధర్‌బాబు అధిష్టానం ధూతతో చర్చల తర్వాత కూడా వెనక్కు తగ్గలేదు. గురువారం సాయంత్రం తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీధర్‌బాబు రాజీనామా సీమాంధ్రుల కుట్రకు దీటైన జవాబవుతుందని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు. అంతకుముందు పార్టీ అధిష్టానం ధూతగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాతో శ్రీధర్‌బాబుతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నప్పుడు రాజీనామా అవసరం లేదని బుజ్జగించారు. ఆయినా శ్రీధర్‌బాబు వెనక్కి తగ్గలేదు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా భేటీ అయి చర్చించారు. కుంతియాతో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పు, తదితర పరిణామాలపై నేతలు చర్చించారు. కుంతియా మంత్రి శ్రీధర్‌బాబుకు ఫోన్ చేసి తనను కలవాలని కోరారు. దీంతో ఏఐసీసీ కార్యదర్శి కుంతియాను కలిసిన శ్రీధర్‌బాబు పరిస్థితిని వివరించారు. శాఖమార్పుపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. అనంతరం రామచంద్ర కుంతియాతో కలిసి మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, ఎంపీ హనుమంతరావు తదితరులు మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ బయలుదేరారు. టీఆర్ఎస్ నేతలు కూడా తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను వారు కేసీఆర్‌ను సంప్రదించారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా రేపటి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. అలాగే మంత్రి శైలజానాథ్ సిఎం కిరణ్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలపైనే చర్చించనట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సిఎం తీరుపై నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణలో తిరగటానికి వీల్లేదన్నారు. సీఎం తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని పొన్నం డిమాండ్ చేశారు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వస్తే గాల్లోనే తుపాకీ పెట్టి ఆ హెలికాప్టర్ పేల్చేస్తామని వ్యాఖ్యానించారు. కిరణ్ కటకటాలు లెక్కించాల్సిందేనని ఆయన చెప్పారు. భవిష్యత్తులో సీఎం అడుక్కోడానికి కూడా అర్హత లేకుండా పోతాడని ధ్వజమెత్తారు. మాజీమంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే రకమైన డిమాండ్ చేశారు. సీఎంను అడ్డుకోవాలన్నారు. ఆయనకు సహకరించవద్దని మంత్రులకు సూచించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో టీడీపీ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనే దానిపై అందరూ దృష్టి సారించారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని నిర్ణయించిన దరిమిలా ఎలాంటి ఘటనలు చేసుకోబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నెల 23 నాటికి రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగియబోతోంది. ఈ దశలో ఎలాంటి చర్చ జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. గడువు పెంచాలని కొందరు, వద్దని మరికొందరు అంటున్న నేపథ్యంలో అసలు చర్చకు ఆస్కారం లేకుండా గత నెలలో ప్రరాంభమైన సమావేవాలు వాయిదా పడ్డాయి. ఈ దశలో అనూహ్యంగా సీఎం పావులు కదిపి శాసనసభా వ్యవహారాలను శ్రీధర్‌బాబు నుంచి తప్పించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చే అజెండాగా శుక్రవారం నుంచి జరగనున్న మలి విడత శాసనసభ సమావేశాల్లో సమైక్య, విభజన వాదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనన్న అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విభజన బిల్లులపై ఆయా శాసనసభలు చర్చించిన తీరును పరిశీలించి వచ్చిన సభాపతి నాదెండ్ల మనోహర్ అక్కడ అనుసరించిన విధానాలపై ఒక నివేదిక రూపొందిస్తున్నారు. దీనిని శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల శాసనసభా పక్ష నేతలకు అందివ్వనున్నారు. ఇదే విసయాన్ని ఆయన సభలో ఓ ప్రకటన చేసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించబోయే వ్యూహం… దాన్ని ఎదుర్కునేలా తెలంగాణ వాదులు రూపొందించే ప్రతివ్యూహంపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల కథనం ప్రకారం తాజాగా సభలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ ద్వారా బిల్లును ప్రవేశపెడతారు. సమైక్య తీర్మానం చేయాలని కోరే అవకాశం ఉంది. టిడిపి, వైకాపాలు కూడా ఇదే కోరుతున్నాయి. లేదా బిల్లుపై చర్చకు అనుమతిస్తూనే… ఇందులో లోపాలున్నాయని, సరైన సమాచారమే లేదని, ఆచరణ సాధ్యం కాదని చెప్పే అవకాశాలు ఉన్నాయి. దీనిద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వాదనను సీఎం వినిపింపజేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మొన్నటి సమావేశాల్లో సీమాంధ్ర నేతలు అడ్డుకున్నట్లుగానే సమైక్య తీర్మానాన్ని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే బిల్లుపై చర్చ ప్రారంభమైందని ఇటీవలి వరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సభలో ప్రకటనకూడా చేశారు. చర్చ ప్రారంభించాలంటూ డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కోరారు. సభ వెలుపల కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. రికార్డుల ప్రకారం చర్చ ప్రారంబమైనట్లే. అయితే ఇది సాంకేతికంగా చెల్లుబాటు కాదంటూ సభా నాయకుడైన ముఖ్యమంత్రి అంగీకరించటం లేదు. అందుకే చర్చ జరగాలని కోరుకుంటున్నానని, ఎవరైన తమ వాదనలు వినిపించాలని సీఎం సూచిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరుగబోతోందన్నది ఆసక్తిగా మారింది. వైకాపా నేతలు బయట, విూడియా ముందు మాట్లాడితే లాభం లేదని, వారు చెప్పదలుచుకున్న అభిప్రాయాలేవో అసెంబ్లీలోనే చెబితేనే వారి మాటలు రికార్డు అయ్యి, కేంద్ర ప్రభుత్వానికి వెళతాయని కూడా సిఎం సూచించారు. అసెంబ్లీలో సభ అభిప్రాయం, సభ్యుల అభిప్రాయం రికార్డుకావాల్సి ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చకు ముందు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకున్న తర్వాత అదనపు సమయం గురించి ఆలోచించాలని సూచించారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం చర్చ జరగాలన్నారు. వైఎస్ జగన్మోహన్డ్డి, చంద్రబాబునాయుడు సమైక్యం అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చ సమయంలో తెలుస్తుందన్నారు. జనవరి 23వ తేదీ వరకు అసెంబ్లీలో చర్చ జరగడంపైనే తన దృష్టి అంటూ, ‘బౌలర్ వేసే బంతిని బట్టి బ్యాట్స్‌మన్ ఆట ఆడాలి కానీ, ముందే ఊహించుకుని బ్యాట్ ఊపితే అవుట్ అయిపోతారని’ స్వయంగా క్రికెటర్ అయిన సీఎం తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అయితే అసెంబ్లీలో ఆయన బౌటింగ్ చేస్తారా లేక బ్యాటింగ్ చేస్తారా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు కనుక దీనిపై చర్చకు, అభిప్రాయాలకు మాత్రమే తావుంది. ఇది తిప్పిపంపినా లేక చర్చించకుండా పంపినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక్కడ జరిగే చర్చ కేవలం ఆయా ప్రాంతాల నేతలు తమ అభిప్రాయాల ద్వారా ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మరోటి కాదు. 23 తరవాత బిల్లు కేంద్రానికి వస్తుందని, ఆ తరవాత ఉంచుకున్నా లాభం లేదని స్వయంగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ అనుసరించే పద్ధతులు, సంప్రదాయాల ప్రకారం చర్చను ప్రారంభించాల్సిందేనని సిఎం అంటున్నారు. తాజాగా శ్రీధర్‌బాబు స్థానంలో సమైక్య వాదాన్ని వినిపించే మంత్రి శైలజానాథ్‌ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు. ఆయనతో బిల్లుని లాంఛనప్రాయంగా ప్రవేశపెట్టించి, చర్చను ప్రారంభింపజేస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సమైక్య వాదాన్ని వినిపించటం, పరిస్థితిని బట్టి సమైక్య తీర్మానాన్ని ప్రతిపాదించటం వంటివి జరగవచ్చు. సమైక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టే ఉద్ధేశంతోనే మంత్రి శ్రీధర్‌బాబు నుంచి శాసనసభ వ్యవహారాల శాఖను ముఖ్యమంత్రి ఆకస్మికంగా తప్పించారని తెలంగాణ మంత్రులు గట్టిగా భావిస్తున్నారు. బిల్లును ఏ రూపంలో వ్యతిరేకించినా సమర్ధంగా ఎదుర్కోవాలని తెలంగాణకి చెందిన మంత్రులు, ఇతర సీనియర్ సభ్యులు నిర్ణయించుకున్నారు. చర్చ ప్రారంభిస్తే సహకరించాలని ఇతరత్రా ఏ రూపంలో బిల్లును వ్యతిరేకించినా అడ్డుకోవాలని భావిస్తున్నారు. బుధవారం సమావేశమైన మంత్రులు దీనిపైనే చర్చించుకున్నారు. తెలంగాణకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో శుక్రవారం జరపబోయే సమావేశంలోనూ శాఖ మార్పు అంశంపై చర్చించాలని భావించారు. మంత్రి పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎలాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినా అలా చేయటం సాధ్యం కాదని భావించినట్లు తెలిసింది. సభలో సమైక్య తీర్మానం ప్రవేశ పెట్టాల్సిందేనని, బిల్లుపై ఏ రూపంలో చర్చ జరిగినా… అది విభజనను అంగీకరించినట్లే అవుతుందని వాదిస్తున్న వైకాపా సభ్యులు సభలో చర్చ జరగకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. శుక్రవారం నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో విభజన బిల్లును శుక్రవారం సభలో ప్రవేశపెట్టటం, చర్చకు తీసుకోవటం వంటివి చేపట్టే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.





