శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) :
తన రాజీనామాను ఆమోదిస్తారో… పెండింగ్‌లో పెడతారో ముఖ్యమంత్రి ఇష్టమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రిగా తనకు లభించిన సౌకర్యాలన్నింటినీ తిరిగి ఇచ్చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ జరగకపోతే లిఖితపూర్వక అభిప్రాయాలు సభాపతికి అందజేస్తామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. చర్చ ప్రారంభమయ్యిందని ఆయన మరోమారు గుర్తు చేశారు. తన రాజీనామాపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదన్నారు. తాను తెలంగాణ కోసం అసెంబ్లీ ప్రోరోగ్ బిల్లు పంపనప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఇది తగని పని అన్నారు. తనకు తెలంగాణ తప్ప ఎలాంటి స్వార్థం లేదన్నారు. ముఖ్యమంత్రి చర్చకు మోకాలడ్డడం తగదన్నారు. కాంగ్రెస్‌కు చెప్పి అన్ని నిర్ణయాలు చేస్తున్నామని అంటున్న వారు అధిష్టానం మాటకు కట్టుబడి బిల్లుపై చర్చించాలన్నారు. మరి దీనికి ఎందుకు అడ్డుపడుతున్నారని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మరోవైపు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో మంత్రి శ్రీధర్‌బాబు శనివారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలోని ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం గుండా శ్రీధర్‌బాబు సభలోనికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగిన పోరాటం తనదని తెలిపారు. అసెంబ్లీలోకి వచ్చిన శ్రీధర్‌బాబుకు టీడీపీ నేతలు నర్సిరెడ్డి, పయ్యావుల కేశవ్ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఓ ఐడియా మీ జీవితాన్ని మార్చేసిందని నర్సిరెడ్డి అనగా, కాలం కలిసి వస్తే అన్నీ అలాగే జరుగుతాయని కేశవ్ అన్నారు. వీరి మాటలకు శ్రీధర్‌బాబు నవ్వుకుంటూ లోనికి వెళ్లిపోయారు. అసెంబ్లీ గతంలో తాను చర్చకు చేసిన ప్రకటన విసయాన్ని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారని భావిస్తున్నారు.
నా రాజీనామా ఆమోదం.. సీఎం ఇష్టమే




