న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి) :
పార్టీ స్థాపించిన ఏడాది కాలంలోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి అధికారపగ్గాలు చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం అప్పుడే కార్యాచరణ చేపట్టారు. తాము పోటీచేసే స్థానాలు, అభ్యర్థుల వివరాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. ఎక్కడెక్కడి నుంచి పోటీ చేసేది త్వరాలో ప్రకటిస్తామన్నారు. ఇదిలావుంటే పలు రాష్ట్రాల్లో ఆప్ పేరుతో ప్రకటనలు వస్తున్నాయి. వీటన్నటిని పరిశీలించాక ఎక్కువ స్థానాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇదిలావుంటే ఢిల్లీలో తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను కేజ్రీవాల్ తీరిస్కరించారు. విపక్షాల నుంచి విమర్శలు రావద్దన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు మామూలు ఫ్లాట్ కేటాయిస్తే చాలన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఆమేరకు కృషి చేస్తారని అభిలషించారు.
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ




