Tuesday, 3 November 2026

తెలంగాణ రాష్ట్ర భక్తులే మన జర్నలిస్టులు

పునర్నిర్మాణంలో టీయూడబ్ల్యూజే కీలకం కావాలి
పోరాడేవానిదే నిజమైన సంఘం
టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ
హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర భక్తులే మన జర్నలిస్టులని టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన టీజేఎఫ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీయూడబ్ల్యూజే కీలకం కావాలని పిలుపునిచ్చారు. పోరాడేవానిదే నిజమైన సంఘమని, ఎలాంటి ఉద్యమాలు నిర్వహించకుండా శాఖల పేరుతో మభ్యపెట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ ప్రాంత జర్నలిస్టులు ఎంతగానో కృషి చేశారని కొందరు కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్లగా మరికొందరు సీమాంధ్ర మీడియా ఆధిపత్య మీడియాలో ఉద్యోగాలు కూడా కోల్పోయారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన పోరాటంలో జర్నలిస్టుల పాత్ర లెక్కకట్టలేనిదని కొనియాడారు. వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులున్నా వాటిని అధిగమించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో భాగస్వాములయ్యారని తెలిపారు. తెలంగాణ ఏర్పడబోతున్న వేళ కొన్ని సంఘాల శాఖల పేరుతో జర్నలిస్టులను మభ్యపెట్ట చూస్తున్నాయని, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆ సంఘాల పాత్ర ఏమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. తెలంగాణ జర్నలిస్టులంతా సాగించిన ఐక్య ఉద్యమాలతోనే మీడియా ఈ ప్రాంత యాసకు, వేశ భాషలకు ప్రాధాన్యం పెరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు అవహేళనకు గురైన తెలంగాణ యాసను తలెత్తుకునేలా చేసిన ఘనత తెలంగాణ జర్నలిస్టులదన్నారు. విస్తరణ కాంక్షతో కొత్త శాఖలు ఏర్పాటు చేస్తున్న సంఘాల పట్ల ప్రజలు, జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జర్నలిస్టులు కీలక భూమిక పోషించబోతున్నారని ఆయన అన్నారు. అనగారిన వర్గాలకు, అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణ ప్రజల ఉన్నతి కోసం జర్నలిస్టులు పాటుపడతారని, అన్యాక్రాంతమైన తెలంగాణ ఆస్తులు తిరిగి దక్కించుకోవడానికి, నిరాధరణకు గురైన తెలంగాణ కళలు, చేతివృత్తుల పునరుజ్జీవానికి తమ వంతు కర్తవ్యం నిర్వర్తిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు శైలేశ్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *