హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో అవమానాలు భరించానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘం డైవి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ముసాయిదాపై రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాల్సిన కీలక సమయంలో తన పోర్టు పోలియో మార్చి సీఎం తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయన మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసమే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పలుమార్లు ప్రకటించిన సీఎం ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. పోర్టు పోలియోలు మార్చినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటును ఆపలేరని స్పష్టం చేశారు. సోనియాగాంధీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నాక ఎందుకు అడ్డుపడుతున్నావని ఆయన సీఎంను నిలదీశారు. బిల్లుపై చర్చ సాగకుండా ఎందుకు పడుతున్నారని.. ఇప్పటికైనా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. తనను అసెంబ్లీకి పంపిన ప్రజల గొంతు వినిపించి, వారి హక్కులను పరిరక్షించాలని అనుకున్నానని, రాజీలేకుండా బిల్లుపై చర్చను అసెంబ్లీకి పంపితే కొందరికి మింగుడుపడటం లేదని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తప్పా? అధిష్టానం రూపొందించిన కార్యాచరణను ముందుతీసుకెళ్లడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగకుండా కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకొని జాప్యం చేయాలని చూసే శక్తులను ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్సీ ఆమోస్, ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి. శ్రీనివాసులు, ఎ. పద్మాచారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు భరించా ఆత్మగౌరవం కోసమే రాజీనామా : శ్రీధర్‌బాబు




