Tuesday, 3 November 2026

బంగ్లా ఎన్నికల్లో 21 మంది మృతి

పోలింగ్‌ బహిష్కరించిన ప్రతిపక్షాలు
ఢాకా, జనవరి 5 (జనంసాక్షి) :
బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆదివారం జరిగిన ఎన్నికలు మారణహోమాన్ని తలపింపజేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో హింసాకాండ చోటు చేసుకుంది. ఈ హింసలో ఒక ఎన్నికల అధికారి సహా విపక్ష పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు మృతిచెందారు. సాయంత్రానికి మృతుల సంఖ్య 21 మందికి చేరింది, రాజధాని ఢాకాకు 407 కిలోమీటర్ల దూరంలోని ఠాకూర్‌ గావ్‌ వద్ద పోలింగ్‌ ప్రారంభం కావడానికి ముందే అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ జోబైదుర్‌ రెహ్మాన్‌ (45) తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఇక్కడ జరిగిన దాడిలో మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. రంగ్‌పూర్‌ జిల్లాలో గల ఒక పోలింగ్‌ కేంద్రంలో జరిగిన ఘర్షణలో జమాత్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు బలయ్యారు. నీల్‌ఫామరి జిల్లాలోని మరో పోలింగ్‌ కేంద్రంపై జరిగిన దాడిని నిరోధించడానికి పోలీసులు జరిపిన కాల్పులో ఒకరు మరణించారు. హింసాకాండ కారణంగా పలు జిల్లాల్లో పోలింగ్‌ వాయిదా వేశారు. బంగ్లాదేశ్‌ 10వ పార్లమెంట్‌ ఎన్నికలు రణరంగంగా మారడంతో ప్రతిపక్ష కూటమి ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. 300 స్థానాలకు గాను ఆదివారం 147 స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. మాజీ ప్రధాని బేగం ఖలిదాజియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) 18 మిత్రపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించడంతో ప్రధాని షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్‌, మరో 11 చిన్న పార్టీలకు చెందిన 153 మంది అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఫలితంగా దేశంలో వంద మిలియన్ల మంది ప్రజలు ఓటేసే అవకాశాన్ని కోల్పోయారు. దేశంలో స్వతంత్ర ఆపద్ధర్మ ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్‌ చేయగా అందుకు అధికార పార్టీ నిరాకరించింది. ఫలితంగా ప్రతిపక్షాలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *