న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలైన ఒక పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపు చ్చింది. పిటిషన్ దాఖలు వేయడాన్ని తొందరపాటుతనంగా పేర్కొంది. అది ఇప్పటికీ తొందరపాటు తనమే అవుతుంది. దానిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఆ అంశంలో మేం జోక్యం చేసుకోలేం. అని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ బోబ్డెలతో కూడిన ధర్మాసనం తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం దాదాపు నాలుగు నెలల క్రితం తెలంగాణపై ఇదే తరహా పిటిషన్‌ను తోసిపుచ్చింది. న్యాయవాది పి.వి కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం నిరాకరించింది. అదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చిందని పేర్కొంది. పిటిషన్‌ను ఉపసంహరించుకునే స్వేచ్ఛ పిటిషన్ దారుకు ఉందని, ఆ అంశంపై రాష్ట్ర అసెంబ్లీ, కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పిటిషన్ దారు తగిన వేదికను ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది.
విభజన వద్దంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీం





