Tuesday, 3 November 2026

అగ్రరాజ్యం గజ..గజ

మైనస్‌ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రత
గడ్డకట్టుకుపోయిన ఇంధనం
ఆగిపోయిన విమాన సేవలు
వాషింగ్టన్‌, జనవరి 7 (జనంసాక్షి) :
అగ్రరాజ్యం అమెరికా గజ.. గజా వణికిపోతోంది. మైనస్‌ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రజాజీవనం పూర్తిగా స్తంభించింది. భారీగా కురుస్తున్న మంచు, తీవ్రమైన చలిగాలులతో ద్రవ ఇంధనం గడ్డకట్టుకుపోయింది. ఫలితంగా పలు ప్రాంతాలకు విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. సోమవారం ఒక్క చికాగోలోని విమానాశ్రయాల నుంచే 1800కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇంధన నిల్వ కేంద్రాల్లో మంచు పేరుకుపోవడంతో ఇక్కడి ఓమార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మిడ్‌వే ఎయిర్‌పోర్టులలో పలు సమస్యలు తలెత్తాయి. చికాగో విమానాశ్రయానికి విమానాలు నడిపే సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఇంధన సమస్యతో సోమవారం మధ్యాహ్నం నుంచి సర్వీసులను రద్దు చేసింది. యునైటెడ్‌, అమెరికన్‌, జెట్‌ బ్లూలాంటి పెద్ద క్యారియర్లు భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేశాయి. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ దాదాపుగా 1600 విమానాలను, మిడ్‌వే సంస్థ మరో 200 వరకూ విమాన సేవలను నిలిపివేశాయని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ సర్వీస్‌ ఫ్లైట్‌ అవేర్‌ వెల్లడించింది. అత్యంత శీతల వాతావరణ పరిస్థితుల్లో విమానాలు నడపడం సాధ్యం కాదని సౌత్‌ వెస్ట్‌ ప్రతినిధి బ్రాడ్‌ హాకిన్స్‌ తెలిపారు. పలు సున్నితమైన వ్యవస్థలు ఆశించిన వేగంతో పనిచేయడం లేదని యునైటెడ్‌ సంస్థ ప్రతినిధి మేరీ ర్యాస్‌ తెలిపారు. ఓహార్‌ విమాశ్రాయంలో ఉష్ణోగ్రత ఉదయం 8 గంటల సమయంలో మైనస్‌ 26.7 డిగ్రీలుగా నమోదుకాగా 1988లో నమోదైన మైనస్‌ డిగ్రీలు ఇప్పటి వరకు రికార్డుగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *