Wednesday, 4 November 2026

మీరు అటా.. ఇటా?

సభలో తేల్చాల్సిందే
వైకాపా, టీడీపీలను టార్గెట్‌ చేసిన కిరణ్‌
హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి) :
మీకేం కావాలో చెప్పండి.. ప్రజల ఆకాంక్షను తెలియజేయండి.. మీ నిర్ణయాన్ని చెప్పండి.. అసెంబ్లీలో స్పష్టం చేయండి.. చిత్తశుద్ధిని చాటుకోండి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి టిడిపి, వైఎస్సార్‌ సిపిలను ఉద్దేశించి అన్నారు. సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మీడియాతో కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌పైన, సాగునీటిపైన, తాగునీటిపైన, విద్యుత్‌, వైద్యం, విద్య తదితర అంశాలలో విభజనవల్ల ప్రజలకు మేలు జరుగుతుందా.. కీడు జరుగుతుందా అనే అభిప్రాయాలను అసెంబ్లీలో తెలియజెప్పండి అని ఇరు పార్టీల అధిపతులనుద్దేశించి అన్నారు. ఇక్కడ చెప్పే అభిప్రాయాలను బట్టి పార్లమెంట్‌లో నిర్ణయం ఉంటుందని చెప్పారు. మరో ఎనిమిది, తొమ్మిది రోజుల సమయం మాత్రమే అసెంబ్లీలో ఉందని, ఈలోగా తెలియజేయాలని కోరారు. తమది జాతీయ పార్టీ అని, టిడిపి, వైఎస్సార్‌ సిపి ప్రాంతీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీల అధినేతలు ఏది చెబితే అదే చెల్లుబాటు అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలా రాష్ట్రాన్ని విభజించాలా అనే విషయాలను స్పష్టం చేయాలని ఆ పార్టీల అధినేతలను కోరుతున్నానని అన్నారు. నాడు ఒక మాట చెప్పారు. అందుకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మీరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేశారు. వాటినే అసెంబ్లీలో తెలియజేయాలని కోరుతున్నామన్నారు. సమైక్యవాదం మా నినాదం కాదు.. విధానమని ఇప్పటికే ఎన్నోమార్లు తాము చాటుకున్నామని చెప్పారు. కలిసి ఉంటేనే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మనకొక చక్కటి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలియజేయాలని, అలాగే అసెంబ్లీలోని, మండలిలోని సభ్యులు అభిప్రాయాలు తెలియజేయాలని కోరారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత శాసనసభ్యులపైన, ఎమ్మెల్సీలపైన ఉందన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను ఇరు సభల్లో ప్రజా ప్రతినిధులు తెలియజేయాల్సిందేనని అన్నారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని, వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తేనే ఖచ్చితంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టంచేశారు. ఇక్కడ చెప్పిన దాన్నిబట్టే పార్లమెంట్‌లో తుదినిర్ణయం తీసుకుంటారని అన్నారు. అభిప్రాయాలను తెలియజేసిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి గడువు పొడిగింపుపై స్పందిస్తామని అన్నారు.
నేనేం చేస్తానో..
నేనేం చేస్తానో అసెంబ్లీలో చూస్తారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు. బిల్లుపైగానీ, బిల్లు గురించిగానీ అసెంబ్లీలోనే తెలియజేస్తానని చెప్పారు. ఎవరికీ ఇవ్వనటువంటి అవకాశాన్ని మనకు రాష్ట్రపతి ఇచ్చారన్నారు. అసెంబ్లీ అభిప్రాయాలను తెలియజేయాలని బిల్లును రాష్ట్రానికి పంపించారని అన్నారు. బిల్లు వివరాలన్నీ సభలోనే తెలియజేస్తానని చెప్పి తన మీడియా సమావేశాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *