Wednesday, 4 November 2026

గడువులోపే టీ బిల్లు పాసవుతుంది

వెంటనే పార్లమెంట్‌లో..
2014లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు : ఆజాద్‌
హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి) :
గడువులోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని, బిల్లు పాసయిన వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌ వెనకడుగు వేయబోదని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ఈ నెల 23వ తేదీలోగా ముసాయిదా బిల్లుపై చర్చించి పార్లమెంటుకు పంపిస్తారని తాను భావిస్తున్నానన్నారు. నెల రోజులుగా అసెంబ్లీలో చర్చలే సాగడం లేదన్నారు. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత విభజన బిల్లును అసెంబ్లీకి పంపించా మన్నారు. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరగకపోయినా రాజ్యాంగం ప్రకారం ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అని, ఆయనెందుకు కొత్త పార్టీని పెడతారని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకపోయినా పార్లమెంట్‌లో పక్రియ పూర్తి చేస్తామని ఆజాద్‌ తెలిపారు. అన్నీ సక్రమంగా సాగుతాయన్న నమ్మకం ఉందన్నారు. శాసనసభ అభిప్రాయం కోసం 42 రోజుల గుడువు ఇచ్చాం నిర్ణీత గడువు లోపు అసెంబ్లీలో చర్చ పూర్తి చేసి బిల్లు పంపిస్తారనుకుంటున్నాను అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతా సవ్యంగా సాగగలదని అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో సందడి నెలకొంది. ఆజాద్‌ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం నేరుగా గాంధీభవన్‌ చేరుకున్నారు. పివి నర్సింహారావు స్మారకోపన్యాసం చేయడానికి ఆయన నగరానికి వచ్చారు. గాంధీభవన్‌లో ఆజాద్‌ను పలువురు నాయకులు కలుసుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన మంత్రి కె. జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ఆజాద్‌ విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌ ఆయనను కలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెసు పరిస్థితిపై గులాం నబీ ఆజాద్‌ ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఉదయం చేరుకున్నప్పటి నుంచి నేతలు పోటాపోటీగా ఆయనతో భేటీ అయ్యారు. ఇదిలావుంటే ఫ్యాప్సీ భవన్‌ వద్ద పివి స్మారక ఉపన్యాసం ఇచ్చేందుకు రాగా సమైక్యాంధ్ర విద్యార్థి నేతలు అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *