Wednesday, 4 November 2026

ఫిబ్రవరిలో పార్లమెంట్‌

ఓట్‌ ఆన్‌, తెలంగాణ, పెండింగ్‌ బిల్లుల ఆమోదం
ఇదే చివరి సమావేశం : కమల్‌నాథ్‌
న్యూఢిల్లీ, జనవరి 8 (జనంసాక్షి) :
ఫిబ్రవరి పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పాటు పలు పెండింగ్‌ బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఆనవాయితీ ప్రకారం సమావేశాలు 15 రోజుల నుంచి పది రోజుల వరకు జరుగుతాయని, అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించేది మాత్రం ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు. బుధవారం నగరంలో నిర్వహించిన ప్రవాస భారతీయ దివస్‌లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెడుతుంది కాబట్టి ఆరు నెలల కోసం తమ ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సభ ముందుకు తీసుకువస్తుందని వివరించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు ప్రతిపాదిస్తున్న అవినీతి నిరోధక బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే రైల్వే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను కూడా ఇదే సమావేశాల్లో ఆమోదిస్తారు. తెలంగాణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ సాగుతున్నందున ఆయన విషయంపై మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ ఈ సమావేశాల ప్రధాన ఎజెండాలో తెలంగాణ అవకాశం కూడా ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *