Tuesday, 3 November 2026

ఆమోదించమనో.. తిరస్కరించమనో బిల్లు రాలేదు

అభిప్రాయాలు మాత్రమే చెప్పండి
దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి) :
ఆమోదించమనో.. తిరస్కరించమనో ఆంధ్రప్రదేశ్‌కు బిల్లు పంపలేదని.. అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఆంధప్రదేశ్‌ శాసనసభలో చర్చిస్తున్నందుకు సంతోషంగా ఉందని, గడువులోపు చర్చ పూర్తి చేయాలని ఆయన సూచించారు. బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని, అభిప్రాయాలు మాత్రమే చెప్పాల్సి ఉంటుందని డిగ్గీరాజా స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఆయన విూడియాతో మాట్లాడుతూ.. విభజన బిల్లుపై కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాలని సూచించారు. బిల్లును ఆమోదించడానికో, తిరస్కరించడానికో రాష్ట్రానికి పంపలేదని స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు వస్తుందో రాదో చెప్పలేనని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసన సభ, శాసన మండలిలో చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. బిల్లుపైన అసెంబ్లీలో చర్చ జరగడం సంతోషకరమని, ఇది శుభ పరిణామమన్నారు. అభిప్రాయ సేకరణ కోసమే తాము బిల్లును అసెంబ్లీకి పంపించామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు అభిప్రాయం చెప్పేందుకు సమయమిచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు వస్తుందో రాదో తెలియదన్నారు. ప్రధాని అభ్యర్థిని ముందుగా చెప్పే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని దిగ్విజయ్‌ పేర్కొన్నారు. కాగా, కేంద్రమంత్రులు కమల్‌ నాథ్‌, గులాం నబీ ఆజాద్‌లు కూడా తెలంగాణ అంశంపై వేర్వేరుగా స్పందించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటు సమావేశాలు ఉంటాయని, ఆ సమయంలో తెలంగాణ బిల్లు పెట్టే విషయమై ఇప్పుడే చెప్పలేమని కేంద్రమంత్రి కమల్‌ నాథ్‌ ఢిల్లీలో అన్నారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుందని, 2014 ఎన్నికల్లోగా ఎపిలో రెండు రాష్టాల్రు ఏర్పడతాయని భావిస్తున్నానని, విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిందని, దాన్ని ఆమోదిస్తారో, వ్యతిరేకించి పంపిస్తారో మెజార్టీ సభ్యుల అభిప్రాయంపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్‌ హైదరాబాదులో అన్నారు. నెల రోజులుగా చూస్తున్నా అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరగడం లేదని, రాష్ట్రపతి ఇచ్చిన గడువు లోగా అసెంబ్లీ తన అభిప్రాయం కేంద్రానికి పంపుతుందని ఆశిస్తున్నానన్నారు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని పంపాలని, గడువులోగా పంపుతారని భావిస్తున్నానని, దానిపై రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్‌ తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అసెంబ్లీ నుంచి కేంద్రానికి బిల్లు వచ్చాక ప్రత్యేక పార్లమెంటు సమావేశాల గురించి ఆలోచిస్తామన్నారు. ఇదిలావుంటే ఫిబ్రవరిలో ప్రత్యేక సమావేశాల్లో బిల్లుపై ఆమోదం జరిగే అవకాశాలు ఉన్నాయని అద్వానీ కూడా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *