Tuesday, 3 November 2026

జనం మెచ్చే నేతలకే టికెట్లు

ముందస్తుగానే వెల్లడిస్తాం : రాహుల్‌
న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) :
జనం మెచ్చే నేతలకే రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్లిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం ప్రతిబింబించేలా టికెట్ల కేటాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్లతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టికెట్ల కేటాయింపులో ఈసారి కొత్త విధానం అనుసరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీలు వేసిన ఏఐసీసీ వ్యక్తులను జల్లెడపట్టే పనిలో పడింది. ఇందుకోసం వేగులు అందించిన సమాచారంతో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే రాహుల్‌గాంధీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు ముప్పావుగంట పాటు వీరి సమావేశం సాగినట్లు సమాచారం. గత వారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రధాని పదవికి రాహుల్‌ తగిన వ్యక్తి అని పేర్కొన్న తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే ప్రథమం.. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశానికి ముందు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. సమావేశం వివరాలు వెల్లడికాలేదు. కోర్‌ కమిటీ సమావేశంలో అవినీతి వ్యతిరేక బిల్లుపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. దీనిలో చేపట్టాల్సిన సవరణలపై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులపై కూడా కాంగ్రెస్‌ పెద్దలు చర్చలు జరిపినట్టు తెలిసింది. సోనియా గాంధీ, టెలికం మంత్రి కపిల్‌ సిబాల్‌, వి. నారాయణ స్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *