సభ్యత్వ నమోదుకు శ్రీకారం
న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) :
దేశ రాజధానిలో రాజకీయ విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశవ్యాప్తం కానుంది. పార్టీని దేశంలోని 20 రాష్ట్రాల్లో విస్తరింపజేసేందుకు ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈమేరకు యువత, సామాన్య ప్రజలను పార్టీ వైపు ఆకర్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం సాగుతోన్న తరుణంలో మెట్రో నగరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అపూర్వ ఆధరణ లభిస్తోంది. అలాగే దేశంలోని ప్రజాస్వామికవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని అభ్యర్థుల రేసులోకి అనూహ్యంగా కేజ్రీవాల్ దూసుకొచ్చారు. రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీకి దీటుగా కేజ్రీవాల్‌కు ప్రజల మద్దతు లభిస్తోంది. తమ రాష్ట్రాల్లో పార్టీ శాఖలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే కేజ్రీవాల్‌కు విజ్ఞప్తులు అందుతున్నాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తున్న ఆప్ నేతలు మొదట దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా రానున్న పక్షం రోజుల్లో అంటే జనవరి 26 నాటికి కోటి మందిని సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్మమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరదలిచిన వారు ఒక్క ఎస్‌ఎంఎస్ పంపితే చాలని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. 07798220033 నంబర్ ఎస్‌ఎంఎస్ పంపి పార్టీ సభ్యత్వం పుచ్చుకోవచ్చని ఆయన సూచించారు.




