Tuesday, 3 November 2026

అక్కడ శుంఠలు కూడా పుట్టారు

ఎన్నికలకు ముందే తెలంగాణ తథ్యం : జైపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 11 (జనంసాక్షి) :

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో కొందరు శుంఠలు కూడా పుట్టారని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో పుట్టిన వారెవరైనా తెలంగాణలో సీఎం కావచ్చని ఆయన అన్నారు. పంజాబ్‌లో పుట్టిన షీలాదీక్షిత్‌ ఢిల్లీ సీఎం అయిన విషయాన్ని మరచిపోవద్దన్నారు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉందని ఇక్కడ ఎవరైనా ఉండవచ్చన్నారు. తెలంగాణ సాధన గొప్ప విజయమని అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ తహశీల్దార్ల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాటాడారు. 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రం చరిత్రలో మరొకటి లేదన్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు.. పోటీ చేసి గెలవొచ్చుని తెలిపారు. సీమాంధ్ర ప్రజలకు ఎవరికీ హైదరాబాద్‌పై భ్రమలు లేవన్నారు. హైదరాబాద్‌ ఇప్పుడూ, తాను పుట్టకముందు కూడా ఉందన్నారు. జై ఆంధ్రా ఉద్యమం సమయంలో లేని భ్రమలు ఇప్పుడు ఎక్కిడి నుంచి వచ్చిందని అడిగారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు, అక్కడ సీమాంధ్ర ప్రజలు అమాయకులని తెలిపారు. హైదరాబాద్‌ ఎప్పటి నుంచో మహానగరమని చెప్పారు. రక్షణ పరిశ్రమలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తారని.. నౌకాశ్రయాలకు దూరంగా ఉండే చోట రక్షణ పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. అందరినీ ఆదరించే సంస్కృతి హైదరాబాదీలకు ఉందని తెలిపారు. పెట్టుబడులకు అందరినీ ఆహ్వానిస్తామని కాని భూసంతర్పణ మాత్రం ఉండదని చెప్పారు. తెలంగాణ వచ్చాక సీమాంధ్ర వాళ్లూ పెట్టుబడులు పెడతారని అన్నారు. రాష్ట్రం విడిపోతే నష్టమేంటో ఎవరూ చెప్పడం లేదని ప్రశ్నించారు. అమెరికాకు మనకు చాలా తేడా వుందని కేంద్రమంత్రి అన్నారు. భారత సమాఖ్య విధానానికి అమెరికాకు చాలా తేడావుందన్నారు. అమెరికాలో లాగా మన దేశంలో రెండు పౌరసత్వాలు లేవని తెలిపారు. ఈ దేశంలో ఎక్కడ పుట్టినా వారైనా ఎక్కడినుంచినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు. సీమాంధ్రలో పుట్టినవాళ్లు కూడా తెలంగాణలో పోటీచేసి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించవచ్చని ఆయన సూచించారు. సీమాంధ్రలో హైదరాబాద్‌పై ఎలాంటి భ్రమలు లేవని అలా వుంటే 1972లో జైఆంధ్ర ఉద్యమం ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్‌ వేరే రాష్ట్రానికి చెందిన వారన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు. కొందరు అదే పనిగా హైదరాబాద్‌ తామే అభివృద్ది చేశామని చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటప్పడు నష్టాలను క ష్టాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలన్నారు. అభివృద్దికి ఇరుప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. ఆధునిక భారతంలో ఎవరిదీ ఏదీ పర్మినెంట్‌ కానద్నారు. అలాగే ఎవరు ఎక్కడైనా ఉండవచ్చన్నారు. గుజరాత్‌ విడిపోయాక ముంబై పనైపోయిందని అందరూ అనుకున్నారని అన్నారు. అలాగే ముంబైలో మహారాష్ట్రీయులు తక్కువన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం శిలాశాసనమేనని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం తధ్యమని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. అవగాహన లేనివారు అధికార మదంతో ఏవేవో మాట్లాడుతున్నారని, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కేంద్రం చేతిలోనే ఉంటుంది తప్ప రాష్ట్రానికి ఎటువంటి అధికారం లేదన్నారు. రాజ్యాంగాన్ని రచించినప్పుడే అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటివారు కేంద్రం పటిష్టంగానే ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నారని, అంతమాత్రాన రాష్ట్రాలు బలహీనంగా ఉండాలని కాదన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం కేంద్రమే రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది తప్ప రాష్ట్రానికి ఎటువంటి అధికారాలు ఉండవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చివరి దశలో ఉందని, ఎన్నికలలోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని, ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నారు. సీమాంధ్రలోని సామాన్య ప్రజలకు తెలంగాణ ఏర్పాటుపట్ల వ్యతిరేకత లేదని, కేవలం కొంతమంది స్వార్థపర పెట్టుబడిదారులే వ్యతిరేకిస్తున్నారని, తన అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా సీమాంధ్రులు అధిక మొత్తంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఖాయమన్నారు. ముంబై నుంచి గుజరాత్‌ విడిపోయినా ప్రస్తుత మహారాష్ట్ర అభివృద్ధి వెనక గుజరాతీల పాత్రే అధికంగా ఉందన్నారు. ఏదేమైనా, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమన్నారు. ఈ ప్రక్రియలో తనవంతు పాత్ర తాను పోషించానని జైపాల్‌రెడ్డి చెప్పారు. గతంలో ముంబై విడిపోయేటప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైబి చవాన్‌ పాత్రే తాను పోషించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ, టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, తహశీల్దార్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *