Wednesday, 4 November 2026

ఏ మతమూ హింసను ప్రేరేపించరాదు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, జనవరి 12 (జనంసాక్షి) :
ఏ మతమూ హింసను ప్రేరేపించదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. కాని కొన్ని పార్టీలు మతోన్మాద హింసను ప్రజ్వలింపజేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతిని జాగృతం చేసిన స్వామి వివేకానందుడిని యువత స్ఫూర్తిగా తీసుకొని మెరుగైన భావి భారతాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత కులమతాలకు అతీతంగా సమైక్య భావాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. మత సహనం, ఓర్పులాంటి గుణాలను వివేనాంద నుంచి అందరూ వినత్రతో నేర్చుకోవాలని పేర్కొన్నారు. పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం నుంచి విముక్తి లభించినట్లుగా దేశ ప్రజలంతా భావించిన రోజే నిజమైన విముక్తి లభించినట్లని ఆయన తెలిపారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనం ఎంతగానో నేర్చుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో ప్రపంచానికి మనం అందించాల్సింది కూడా అంతే స్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం సంకుచిత రాజకీయాలు పెరిగిపోయాయని, వాటి పట్ల ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం పాటు పడుతున్నామని, యువతకు ఉపాధి కల్పన, మెరుగైన విద్యావకాశాలు సృష్టించడంలో యూపీఏ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించజూస్తున్న పార్టీలను ఓ కంట కనిపెట్టాలని అన్నారు. రాజకీయాలంటే సేవ చేయడానికే కాని ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడానికి ఎంతమాత్రం కాదని ఆయన తెలిపారు. యువత దేశాభివృద్ధికి ప్రధానమని, నైపుణ్యాల గల యువత మన దేశంలో ఎంతో ఉందని తెలిపారు. మేధో యువత వల్ల దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నామని, ఉన్నతమైన దేశాన్ని యువత చేతిలో పెట్టడమే తమ అభిమతన్నారు. యువత నిర్లక్ష్యం, నిస్సత్తువ ఆవరించకుండా జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడు సూచించిన మార్గంలో ముందుకు సాగాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *