యువరాజును ఓడిస్తా : కుమార్ విశ్వాస్
అమేథి, జనవరి 12 (జనంసాక్షి) :
పార్టీ స్థాపించిన ఏడాదిలోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సత్తాచాటి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కంచుకోట, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గంలోనూ హల్‌చల్ సృష్టిస్తోంది. అమేథిలో ఆ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన కుమార్ విశ్వాస్ కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీని ఓడించి తీరుతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కాకలు తీరిన నాయకులను సైతం పట్టించుకోని అమేథి కాంగ్రెస్ శ్రేణులు కుమార్ విశ్వాస్ పోటీలో ఉండటాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం అమేథిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జనవిశ్వాస్ ర్యాలీకి వ్యతిరేకంగా కొందరు నాయకులు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో తమ పార్టీ ర్యాలీకి పూర్తి భద్రత కల్పించాలని ఆప్ నేతలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రీయ రాష్ట్రవాది పార్టీ పేరుతో అమేథి నియోజకవర్గ వ్యాప్తంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, కుమార్ విశ్వాల్ తదితరులు దేశద్రోహులంటూ ఆ హోర్డింగుల్లో పేర్కొన్నారు. అమేథి జిల్లా ఆప్ కన్వీనర్ హనుమాన్‌సింగ్ నేతృత్వంలో 20 మంది నాయకులు జిల్లా మేజిస్ట్రేట్ జగత్‌రాజ్ తివారీతో భేటీ అయి తాము నిర్వహించే ప్రదర్శనకు అదనపు భద్రత కల్పించాలని కోరారు. దీనిపై రాష్ట్రీయ రాష్ట్రవాది పార్టీ చీఫ్ ప్రకాశ్‌చంద్ర మాట్లాడుతూ, ఆప్ కార్యకర్త సంతోష్‌కోలి మృతదేహంపై గతేడాది ఆగస్టులో త్రివర్ణ పతకాన్ని కప్పారని, ఇది జాతీయ పతకాన్ని అవమాన పర్చడమేనన్నారు. ఈ చర్యకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు లక్నోబెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఇలాంటి ద్రోహులు నిర్వహించే ర్యాలీని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమేథిలో నిర్వహించిన జనసందేశ్‌యాత్రలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాలను నిరసిస్తూ, అవినీతిని ప్రశ్నిస్తూ తాము యాత్ర చేపట్టినట్లు వివరించారు. అమేథిలో కరెంట్ ఎందుకు ఉండటం లేదో, అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపమని తాము ప్రశ్నిస్తున్నామన్నారు.
అమేథిలో ఆమ్ ఆద్మీ హల్‌చల్




