Wednesday, 4 November 2026

రాహుల్‌జీ మెదక్‌కు రండి

పరిశీలకులకు వెళ్లువెత్తుతున్న దరఖాస్తులు
హైదరాబాద్‌/సంగారెడ్డి, జనవరి 12 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థనలు పెరిగి పోతున్నాయి. మూడోసారి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారం చేపడితే రాహుల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సంకేతాలుండటంతో ఆయన మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నేతలు కోరుతున్నారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర మంత్రి వి. సునీతాలక్ష్మారెడ్డి. ప్రభుత్వం విప్‌ కె. జయప్రకాష్‌ రెడ్డి (జగ్గారెడ్డి), పటాన్‌ చెరు ఎమ్మెల్యే టి నందీశ్వర్‌గౌడ్‌, తదితరులు కోరారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికిక ఆకాంక్షిస్తున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు వచ్చిన ఎఐసిసి పరిశీలకులకు వారు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌ చెరు శాసనసభా నియోజకవర్గాల పరిధిలో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒకవేళ రాహుల్‌ గాంధీ మెదక్‌ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. ఒకవేళ అందుకు నిరాకరిస్తే, బలమైన నాయకుడ్ని సూచించాలని కూడ వారు కోరారు. పటాన్‌ చెరు శాసణసభా నియోజకవర్గం నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని ఎఐసిసి పరిశీలకులు తెలిపారు. నర్సాపూర్‌, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి మంత్రి సునీతారెడ్డి, ప్రభుత్వ విప్‌ జయప్రకాశ్‌ రెడ్డి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఎఐసిసి పరిశీలకులు తెలిపారు. జిల్లాలో తానొక్కడినే బిసిల నుంచి ఎన్నికైన శాసనసభ్యుడినని, తిరిగి తన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేయాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కోరారు. జయప్రకాశ్‌రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పది శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *