Wednesday, 4 November 2026

మల్టీ బ్రాండ్‌లకు ఎఫ్‌డీఐల్లో మినహాయింపు లేదు

ఆప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం
జనతాదర్బర్‌ ఇక ఉండదు : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, జనవరి 13 (జనంసాక్షి) :
మల్టీ బ్రాండ్లకు ఎఫ్‌డీఐల్లో మినహాయింపునిస్తూ షీలాదీక్షిత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉపసంహరించుకుంది. ఈమేరకు ఢిల్లీ ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ)కి లేఖ రాసింది. ఈ విషయాన్ని ఢిల్లీ పరిశ్రమల శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ వెల్లడించారు. మల్టీ బ్రాండ్‌ కంపెనీలు నేరుగా ఢిల్లీలో వ్యాపారం చేసుకునేందుకు 2002 జులైలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు అమిత్‌ పేర్కొన్నారు. అదే సమయంలో రైతులు నేరుగా తమ వ్యవసాయోత్పత్తులను మార్కెటింగ్‌ కమిటీల ద్వారా విక్రయించుకోవడానికి అనుమతినిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అమతిస్తూ నిర్ణయం తీసుకోగానే మల్టీ బ్రాండ్‌ కంపెనీలు నేరుగా తమ విక్రయాలు సాగించేందుకు అప్పట్లో షీలా దీక్షిత్‌ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ బ్రాండ్లను నేరుగా మార్కెట్‌లో విక్రయించడం ద్వారా దేశీయంగా ఆయా వస్తువులు ఉత్పత్తి చేసే వారి ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆప్‌ కీలక నిర్ణయం వెల్లడించింది. అలాగే ఇకపై జనతా దర్బారు నిర్వహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ పేర్కొన్నారు. వారానికి ఒక రోజు తానే ప్రజలను కలుస్తానని ఆయన తెలిపారు. గత శనివారం జనతా దర్బారుకి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇది శాంతి భద్రతల సమస్యగా మారడంతో దీనిని అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఈ దశలో ఇక ప్రజలను నేరుగా కలవాలని కేజ్రీవాల్‌ నిర్ణయించారు. ఆ రోజు రద్దీ కారణంగా సీఎం మధ్యలోనే వెళ్లిపోవాల్సివచ్చింది. ఈ రోజు ఆయన పిల్లల నర్సరీ పాఠశాల అడ్మిషన్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ ప్రారంభించారు. పిల్లల ప్రవేశాల విషయంలో తమకెదురయ్యే సమస్యల గురించి తల్లిదండ్రులు ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుచేయవచ్చు. విద్య, ఆరోగ్యం తమ ప్రభుత్వ ప్రధాన ప్రాథమ్యాలని కేజీవ్రాల్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *