బాధ కలిగిస్తే మన్నించండి : జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 13 (జనంసాక్షి) : పండిత పుత్ర.. పరమశుంఠ అన్నదే తన భాష్యమని, అంతే తప్ప ఎవరినీ శుంఠ అని అనలేదని బాధ కలిగిస్తే మన్నించాలని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. శుంఠ అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. వ్యంగ్య ధోరణిలో వాడిన శుంఠ అనే పదాన్ని తిట్టుగా చిత్రీకరించారని అన్నారు. ఇది తాను సానుకూల దృక్పథంతో వాడినా కొందరు అపార్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. పండిత పుత్రః పరమ శుంఠః సామెతను దృష్టిలో పెట్టుకునే తాను మాట్లాడానని వివరించారు. టంగుటూరి, పట్టాభి పాండిత్యాన్ని శ్లాఘిస్తూ సీమాంధ్ర నేతలను పండిత పుత్రః పరమ శుంఠః అని అన్నట్లు చెప్పారు. నేటి సీమాంధ్ర నేతలు తెలంగాణ చారిత్రక అనివార్యతను గుర్తించలేకపోతున్నారనేదే తన ఆవేదన అని వెల్లడించారు. అయితే దీనిని తప్పుగా భావించి విమర్శలు చేసిననేపథ్యంలో దీనిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.




