Wednesday, 4 November 2026

రాహుల్‌కు పగ్గాలు ఇప్పుడే వద్దు

అటూఇటైతే యువనేతకే మచ్చ
ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి
కాంగ్రెస్‌ మల్లగుల్లాలు
న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని నివాసంలో జరిగిన కోర్‌కమిటీ భేటీలో ఇదే అంశంపై చర్చింనట్లు తెలుస్తోంది. అలాగే గురువారం నాటి సిడబ్ల్యూసిలో కూడా దీనిని చర్చించనున్నారు. బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించి ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. రాహుల్‌ను ప్రధానిగా ప్రకటించాలా? వద్దా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా రాహుల్‌ మాత్రం ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో బుధవారం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ మరోసారి సమావేశమైంది. భేటీకి రాహుల్‌తో పాటు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుశీల్‌ కుమార్‌ షిండే, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ సమావేశమైయ్యారు. జనవరి 17వ తేదీ శుక్రవారం జరుగునున్న ఏఐసీసీ భేటీలో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారు. దీంతో ఈ భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్‌ కమిటీ భేటీలో రాహుల్‌కు అప్పగించే బాధ్యతలపై కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా అంకితభావంతో నిర్వర్తిస్తానని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇప్పటికే అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయరని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే పార్టీ సమావేశంలో రాహుల్ను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిగా తనను ఎంపిక చేస్తే అంగీకరిస్తానని రాహుల్‌ పరోక్షంగా వెల్లడించారని రాజకీయ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. యువతతో పార్టీ మరింతగా మమేకం కావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా క్రియాశీలక పాత్ర పోషించనున్నారని పెద్ద ఎత్తున వచ్చిన ఊహాగానాలకు కాంగ్రెస్‌ తెరదించింది. తల్లి, సోదరుడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజక వర్గాల్లో మాత్రమే ప్రియాంక ప్రచారం చేస్తారని స్పష్టం చేసింది. దీంతోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా జరిపే పర్యటనల షెడ్యూల్‌ ఖరారులో ఆమె సమన్వయకర్తగా ఉంటారని పేర్కొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌ అజయ్‌ మాకెన్‌ మీడియా మాట్లాడుతూ ఈ వివరాలు ఇప్పటికే వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *