Wednesday, 4 November 2026

కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం

ముందుంది మరింత మంచికాలం : చిదంబరం
న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) :
దేశ ఆహార ద్రవ్యోల్బణ సూచీ ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి దిగివచ్చింది. బలమైన ఆర్థిక పునాదుల మీదే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. వచ్చే మూడేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతి బాటలో నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్ధికవృద్ధి పురోగతితో త్వరలో చమురుకు డిమాండ్‌ పెరుగుతుందని చిదంబరం వివరించారు. పెట్రోకెమ్‌ ముగింపు కార్యక్రమంలో చిదంబరం మాట్లాడారు. గతంతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. అలాగే గత ప్రాజెక్టులకన్నా ప్రస్తుతం మరింత బలంగా సాగుతున్నామని చెప్పారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. గత ఆర్థక సంవత్సరంతో పోల్చి చూసినా ఇప్పుడున్న పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఇదిలావుంటే బుధవారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 257 పాయింట్లు లాభపడి, 21,289 వద్ద సెన్సెక్స్‌ ముగిసింది. 79 పాయింట్లు లాభపడి 6,320 వద్ద నిప్టీ ముగిసింది. ఆర్థికాభివృద్ధిని మెరుగుపరిచే విధంగా రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఊహాగానాలు, 5 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోవడంతో సానుకూలంగా స్పందించిన భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 257 పాయింట్ల లాభంతో 21289 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల వృద్ధితో 6320 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, రియాల్టీ, ఆటో రంగాలకు సంబంధించిన షేర్లు లాభాలతో ముగిసాయి. అల్టా టెక్‌ సిమెంట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌ డీ ఎఫ్‌ సీ, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌, హీరో మోటో కార్ప్‌, భెల్‌, సెసా స్టెర్‌ లైట్‌, సిఎలా కంపెనీలు లాభాలతో ముగిసాయి. రాన్‌ బాక్సీ, కెయిర్న్‌ ఇండియా, లుపిన్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. మరోవైపు కూరగాయలు, పళ్ల ధరల పెరుగుదల కొద్దిగా ఉపశమించడంతో డిసెంబరు నెలకు వినియోగ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి పరిమితమైంది. ఇది మూడు నెలల కనిష్ఠ స్థాయి. రిజర్వు బ్యాంకు కీలక విధాన రేట్లను తగ్గించడానికి ఇది కొంత మేరకు మార్గం సుగమం చేసింది. ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే డిసెంబరులో కూరగాయల ధరలు 38.76 శాతం పెరిగాయి. నవంబరులో ఈ పెరుగుదల రేటు 61.6 శాతం ఉంది. పళ్ల ధరల పెరుగుదల డిసెంబరు నెలలో 14.54 శాతం నమోదైంది. నవంబరులో ఇది 15 శాతం ఉందని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో పప్పు ధాన్యాల ధరలు 2.15 శాతం, ముతక ధాన్యాల ధరలు 12.14 శాతం, పాల ఉత్పత్తుల ధరలు 9.87 శాతం చొప్పున ప్రియం అయ్యాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు 12.64 శాతం పెరిగాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కించే వినియోగ ద్రవ్యోల్బణాన్ని నవంబరు నెలలకు 11.16 శాతానికి సవరించారు. మరోవైపు ఉల్లిగడ్డలు జనానికి, పండించే రైతులకు ధరల గాయాలను మిగల్చగా, విత్తన కంపెనీలకు లాభాలు కురిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం వరకూ బహిరంగ మార్కెట్‌లో మండిపోయిన వీటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. అప్పుడు ఒక దశలో కిలో ధర రూ.80 నుంచి రూ.100కు చేరడంతో జనం జేబులకు చిల్లులు పడ్డాయి. ఇప్పుడు ధర తగ్గడం వల్ల సామాన్యులకు కాస్త ఉపశమనంగా ఉన్నప్పటికీ, రైతులు నష్టపోతున్నారు. రైతులను ఆదుకొనేందుకు విదేశాలకు ఎగుమతులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. గత నవంబరులో ధరలు బాగా పెరగడంతో దేశీయ మార్కెట్‌ను నియంత్రించడంతో పాటు విదేశాలకు ఎగుమతులను తగ్గించే ఉద్దేశంతో కేంద్రం ఆంక్షలు పెట్టింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రైతులను ఆదుకోవడానికి, దేశీయ మార్కెట్‌లో టోకు ధరలు పెంచేందుకు తిరిగి ఎగుమతులను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయినా ఇప్పటి దాకా టోకు ధరలు పెద్దగా పెరగడం లేదు. విదేశాలకు ఎగుమతులు మాత్రం క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధానమైన కర్నూలు మార్కెట్‌లో ప్రస్తుతం ఉల్లిగడ్డలు రోజుకు వెయ్యి బస్తాలకు మించి రావడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో దీనికి రెట్టింపు వచ్చేవి. ప్రస్తుతం కర్నూలులోనే టోకు ధర క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 వరకే ఉంది. గత ఖరీఫ్‌లో పండించిన పంటంతా రైతులు డిమాండు ఉన్నందున డిసెంబరుకల్లా అధిక శాతం అమ్మేశారు. ఇప్పుడు రబీలో వేసిన పంట మార్కెట్‌కు రావడానికి మరో నెలపైనే పడుతుందని మార్కెటింగ్‌ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *