ఆ ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాస్ నిరాకరణ
ఏఐసీసీ సమావేశాలకు బయటే
కంగుతిన్న అసమ్మతి ఎంపీలు
న్యూఢిల్లీ, జనవరి16 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీమాంధ్రకు చెందిన అసమ్మతి నేతలకు కర్రు కాల్చి వాతపెట్టింది. అవిశ్వాసం ప్రతిపాదించిన ఆరుగురు సొంత పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ పెద్ద షాక్ ఇచ్చింది. వీరి చర్యలను ఓ కంటకనిపెట్టిన కాంగ్రెస్ శుక్రవారం జరగనున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొనకుండా దూరం పెట్టింది. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు ఎఐసిసి సమావేవాల్లో పాల్గొనకుండా పాసులు నిరాకరించారు. ఏఐసీసీ సమావేశంలో గొడవ చేయొచ్చన్న కారణంతో పార్లమెంట్‌లో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఈ ఆరుగురు ఎంపీలకు పాసులు నిరాకరించినట్లు సమాచారం. వీరిలో లగడపాటి రాజగోపాలు, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, సాయిప్రతాప్, హర్షకుమార్ ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ నిర్ణయాన్ని ధిక్కరించి విబజనకు వ్యతిరేకంగా సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టారు. గత సమావేశాల్లో వీరు నోటీసులు ఇచ్చినా అది చర్చకు రాలేదు. అవసరమైతే పార్టీని ధిక్కరించి ముందుకు వెళతామని వీరు చేసిన ప్రకటనలతో అప్రమత్తమైన కాంగ్రెస్ వీరికి ద్వారాలు క్లోజ్ చేసింది. దీంతో ఇక వీరి భవిష్యత్ కూడా అగమ్య గోచరమన్న సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఇక వీరికి టిక్కెట్లు దక్కవన్న సందేశాన్ని ఇచ్చింది. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేలా శుక్రవారం జరిగే ఏఐసీసీ సమావేశాల్లో తీర్మానం చేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. విభజన ముసాయిదా బిల్లుపై భేటీలో చర్చించి, దానిని పక్కనబెట్టాలని కోరారు. ఏఐసీసీ సమావేశాల్లో సీమాంధ్ర భావోద్వేగం ప్రతిధ్వనించాలన్నారు. అయితే తనకు అనుకూలంగా ఉన్న ఈ ఆరుగురు ఎంపీల ద్వారా తీర్మానం పెట్టించాలని అశోక్‌బాబు ప్రయత్నిచినట్లు సమాచారం. ఈ ఆరుగరికి ఎంట్రీ లేకపోవడంతో ఇక ఆయన వాదనకు పసలేకుండా పోయింది. అందుకే సమైక్యాంధప్రదేశ్ పోరాటాన్ని సీమాంధ్ర ఎంపీలు దాదాపు వీడారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల భావోద్వేగాన్ని దృష్టిలో ఉంచుకొని శాసనసభ్యులు అసెంబ్లీలో శతధా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోదని విశ్వాసం వ్యక్తంచేశారు. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిణామాలు జరిగితే ఏపీఎన్‌జీవోలు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపడతారని హెచ్చరించారు. ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగిసిన తర్వాత మరోసారి ఢిల్లీలో జాతీయ పార్టీల నాయకులను కలుస్తామని తెలిపారు. విభజన అంశంపై సరైన సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో 22న ‘చలో హైదరాబాద్’ చేపట్టనున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన ఆరుగురు ఎంపీలకు ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానం అందకపోవడం దారుణమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మండిపడ్డారు. ఆహ్వానం రాకపోవడంపై ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో మాట్లాడి తేల్చుకుంటానని చెప్పారు. తమ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని లగడపాటి గుంటూరులో విూడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్లీనరీ సమావేశంలో పాల్గొనే అధికారం కాంగ్రెస్‌వాదిగా తనకు ఉందని చెప్పారు. అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్‌పై కాదని.. యూపీఏ ప్రభుత్వంపైనేనని వివరించారు. మేనిఫెస్టోకి వ్యతిరేకంగా వ్యవహరించడం అధిష్ఠానానికి సరికాదని హితవుపలికారు. రాష్ట్రవ్యాప్తంగా సమైక్యాంధ్ర ప్లెక్సీలు, ప్రచార రథాల అంశం ఇవాళే తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనివెనక ఎవరున్నారన్నది తనకు తెలియదన్నారు. అలాగే తమను కాదనే హక్కు లేదన్నారు. ఇదిలావుంటే తాము ఏఐసీసీ సభ్యులుగా ఉన్నప్పటికీ ఢిల్లీ సదస్సుకు ఆహ్వానం అందలేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలిపారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశానికి సీమాంధ్ర సీనియర్ నేతలకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నేతలకు మాత్రం ఆహ్వానం పంపిన అధిష్టానం తమపై వివక్ష చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఇక లేదని హైకమాండ్ భావిస్తున్న కారణంగానే తమను పిలవక పోవడానికి కారణమై ఉండవచ్చని ఎమ్మెల్యేలు జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డిలు తెలిపారు. అందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేల పట్ల వివక్షత చూపుతున్నట్లుగా కనబడుతోందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో ఇతర సీమాంధ్ర ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాత దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేస్తామని వారు స్పష్టం చేశారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో తరగతుల వారీగా ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి కోరామన్నారు. ఆ ప్రకారం చర్చించేందుకు గుడువు పెంచాలని కోరతామని వారు తెలిపారు. ఆ మేరకు సీఎం, సభ కూడా గడువు పెంచాలని రాష్ట్రపతికి సూచించే అవకాశం ఉందన్నారు.తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు గడువు పెంచాలన్న విషయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ద్వారా కోరతామని దివాకర్‌రెడ్డి అన్నారు. చర్చపై కాంగ్రెస్ పార్టీ సమయాన్ని వృధా చేయలేదని తెలిపారు.
కర్రు కాల్చి వాత




